స్నైపర్లు, స్వాట్‌ కమాండోలు,1000 మంది పోలీసులు.. ఎర్రకోట వద్ద భద్రతా వలయాలు!

సిక్కుమత గురువు తేగ్‌ బహదూర్ 400వ జయంతి సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Updated : 21 Apr 2022 17:48 IST

దిల్లీ: సిక్కుమత గురువు తేగ్‌ బహదూర్ 400వ జయంతి సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 1000 మందికి పైగా దిల్లీ పోలీసులు, వివిధ ఏజెన్సీలకు చెందిన బలగాలతో భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. ప్రసంగ వేదికలో సహా కోట ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాలతో పహారా కాస్తున్నారు.

ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు, స్వాట్ కమాండోలు, కైట్ క్యాచర్లు, కానైన్ యూనిట్లు, షార్ప్ షూటర్లతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే దిల్లీలో కరోనా కేసులు పెరుగుతోన్న తరుణంలో కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం రోజు చేసే ఏర్పాట్ల మాదిరిగానే పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నాం. అలాగే జహంగీర్‌పురి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మేం మరింత అప్రమత్తంగా ఉండాలి’ అంటూ ఓ సీనియర్ అధికారి తెలిపారు. 

సిక్కు గురువు తేగ్‌ బహుదూర్‌ జయంతిని పురస్కరించుకొని.. ఈ రోజు ప్రధాని ఆయన తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. నాలుగు వందల మంది సిక్కు సంగీతకారులు ‘షాబాద్‌ కీర్తన’లు ఆలపించనున్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దిల్లీ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సహకారంతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని