Rahul Gandhi: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్‌

తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వక్రీకరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.

Published : 18 Mar 2024 18:57 IST

దిల్లీ: ‘శక్తి’పైనే తమ పోరాటం అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వక్రీకరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. అవి ఏ మతపరమైనవి కావని.. కేవలం అధర్మం, అవినీతి, అసత్యాల గురించేనని క్లారిటీ ఇచ్చారు. ఈసందర్భంగా ప్రధానిపై విరుచుకుపడిన ఆయన మోదీ వేసుకున్న ‘ముసుగు పవర్‌’ను ఉద్దేశిస్తూ తాను అలా మాట్లాడానన్నారు.

‘నా మాటలు మోదీకి ఇష్టముండదు. వాటిని వక్రీకరిస్తూ ఏదోవిధంగా అర్థాలు మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే నేను మట్లాడేవి గంభీరమైన వాస్తవాలని వారికి తెలుసు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాను పేర్కొన్న ‘శక్తి’.. మోదీ వేసుకున్న ముసుగు గురించేనన్నారు. దానిపైనే తాము పోరాడుతున్నామని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఈసీ, మీడియాతోపాటు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసే శక్తి వారికుందన్నారు. కొన్ని వేల రూపాయల రుణాలను చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. రూ.వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాలను ప్రధాని మాఫీ చేస్తున్నారని ఆరోపించారు.

ఇదిలాఉంటే, ‘శక్తి’ని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్లు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. జగిత్యాలలో (తెలంగాణ) జరిగిన భాజపా ‘విజయ సంకల్ప సభ’లో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతల ప్రకటనలను తిప్పికొట్టారు. ఈ దేశంలోని ప్రతి మహిళ, కుమార్తె ఆ శక్తి స్వరూపమేనని.. దానిని నాశనం చేస్తామని విపక్ష కూటమి మేనిఫెస్టోలో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సవాల్‌కు సిద్ధమంటూ మోదీ చెప్పడంపై రాహుల్ ఇలా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని