Punjab Gangsters: పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్లకు.. జైషే ఉగ్రవాదులకు సంబంధాలు..!

పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్లకు, కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలుపై కశ్మీర్‌ స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. గతేడాది  కశ్మీర్‌కు చెందిన వాహనం నుంచి రూ.43 లక్షలు రికవరీ చేసిన కేసుకు సంబంధించి

Published : 27 Jul 2022 23:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్లకు, కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలపై కశ్మీర్‌ స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. గతేడాది  కశ్మీర్‌కు చెందిన ఓ వాహనం నుంచి రూ.43 లక్షలు రికవరీ చేసిన కేసుకు సంబంధించి ఈ ఛార్జ్‌షీట్‌ నమోదైంది. ఈ మేరకు పంజాబ్‌కు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు, పాక్‌కు చెందిన జైషే కమాండర్‌ పేర్లను ఇందులో ప్రస్తావించారు. యూఏపీఏ, ఆయుధ చట్టం, ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. గత మూడు నెలల్లో ఉగ్ర నిధుల కేసులో నమోదైన రెండో ఛార్జ్‌షీట్‌ ఇది.

ఈ ఛార్జ్‌షీట్‌లో జైషే కమాండర్‌ ఆషిక్‌ నంగ్రూ అలియాస్‌ ఆషిక్‌ మౌల్వీ పేరును ప్రస్తావించారు. దక్షిణ కశ్మీర్‌కు చెందిన ఇతను ప్రస్తుతం పాక్‌ నుంచి పనిచేస్తున్నాడు. ఇక పుల్వామాకు చెందిన ముజమిల్‌ అహ్మద్‌ మాలిక్‌, రవికుమార్‌ అలియాస్‌ నోన, జైదీప్‌ ధవన్‌, అమర్‌బీర్‌ సింగ్‌ అలియాస్‌ గోపాల్‌ మహల్‌ పేర్లు ఉన్నాయి.

గతేడాది నవంబర్‌ 16న సిధ్ర వంతెన వద్ద కశ్మీర్‌ నంబర్‌ ప్లేటుతో ప్రయాణిస్తున్న కారు నుంచి రూ.43 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. ఆ కారులో పంజాబ్‌ నుంచి నిధులు తీసుకొని వస్తున్న మౌజమ్‌ పర్వేజ్‌, ఉమర్‌ ఫరూక్‌లపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మే 14న ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. పర్వేజ్‌, ఫరుఖ్‌లు ఇద్దరూ మాలిక్‌, నంగ్రూతో కలిసి ఉగ్ర నిధులను తరలించేందుకు కుట్ర పన్నినట్లు కేసు నమోదు చేశారు. ఈ నిధులను కశ్మీర్‌ లోయలో విస్తరించిన జేఈఎం ఉగ్రవాదులకు చేరవేస్తున్నట్లు అధికారులు ఆరోపించారు. వీటిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారని ఎస్‌ఐఏ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని