Ukraine Crisis: మన జాతీయ జెండా.. టర్కీ, పాకిస్థానీయులకూ అండ!

రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్‌ నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు.

Published : 03 Mar 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్‌ నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు. ముఖ్యంగా భారత పౌరులు ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి ఇతర దేశాల సరిహద్దులకు చేరుకోవాలని భారత ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం భారత జాతీయ జెండాలను పట్టుకోవాలని పౌరులకు సూచించింది. ఈ ఐడియాను అందిపుచ్చుకుని కొందరు పాకిస్థాన్‌, టర్కీకి చెందిన విద్యార్థులు కూడా ఉక్రెయిన్‌ సరిహద్దులను సురక్షితంగా దాటగలిగారు.

ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు ‘ఆపరేషన్‌ గంగ’ పేరుతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఎయిరిండియా, స్పైస్‌జెట్‌, ఇండిగో సంస్థలు ఈ విమానాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక విమానం అందుకునేందుకు ఉక్రెయిన్‌ పొరుగుదేశమైన రొమేనియాలోని బుచారెస్ట్‌కు కొందరు భారత విద్యార్థులు చేరుకున్నారు. భారత జెండాలను పట్టుకోవాలన్న భారత ప్రభుత్వ సూచనను వారు పాటించారు.

అయితే, తాము జాతీయ జెండాను ఎలా రూపొందించిందీ ఉక్రెయిన్‌లోని ఒడెసా నుంచి బుచారెస్ట్‌కు చేరుకున్న ఓ విద్యార్థి వివరించారు. ప్రభుత్వం సూచించిన వెంటనే మార్కెట్‌కు వెళ్లి జాతీయ జెండా రంగులు ఉన్న స్ప్రేలు కొనుగోలు చేసి, వాటితో జాతీయ జెండాను రూపొందించామని ఆ విద్యార్థి వివరించాడు. మన జెండాను చూపించి ఉక్రెయిన్‌ సరిహద్దును దాటడం తమకు సులువైందని పేర్కొన్నాడు. అయితే, తమను చూసిన కొందరు పాకిస్థాన్‌, టర్కీ విద్యార్థులు సైతం భారత జాతీయ జెండాను చేతబూని సరిహద్దులను దాటారని వివరించాడు. ఉక్రెయిన్‌లోని మాల్దోవాలో సరిహద్దుల్లో భారత రాయబార కార్యాలయం తమకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిందని, అక్కడి ప్రజలు కూడా తమకు సహకరించారని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని