Sonia Gandhi: 21 ఏళ్లకే ప్రేమలో పడి.. 44ఏళ్లకే భర్తను కోల్పోయి..! అమ్మ గురించి ప్రియాంకా గాంధీ

ఇటలీ నుంచి సోనియా గాంధీ.. భారతీయ సంప్రదాయాలను నేర్చుకునేందుకు మొదట్లో ఎంతో కష్టపడ్డారని ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. రాజకీయాలంటే ఇష్టం లేనప్పటికీ దేశసేవ కోసం పనిచేస్తున్నారని అన్నారు.

Published : 17 Jan 2023 01:44 IST

దిల్లీ: ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ (Sonia Gandhi).. భారత్‌కు వచ్చిన తర్వాత ఇక్కడి సంప్రదాయాలను నేర్చుకునేందుకు కష్టపడ్డారని ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) వెల్లడించారు. అంతేకాకుండా అప్పట్లో సోనియాకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక పీసీసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇద్దరు ధైర్యవంతుల (తల్లి సోనియా, నానమ్మ ఇందిరా గాంధీ) చేతుల్లో తాను పెరిగానని చెప్పారు.

‘నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే ఇందిరా గాంధీ (Indira Gandhi) తన 33ఏళ్ల కుమారుడిని కోల్పోయారు. సంజయ్‌ గాంధీ మరణించిన మరుసటి రోజు నుంచే విధులకు హాజరయ్యారు. కర్తవ్యం పట్ల తనకున్న నిబద్ధత, ఆమెలో ఉన్న శక్తి అటువంటిది. ప్రాణాలు కోల్పోయేవరకూ దేశంకోసం సేవ చేశారు’ అని నానమ్మ ఇందిరా గాంధీని స్మరించుకున్నారు. ఇక అమ్మ (సోనియా గాంధీ) గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రియాంక.. 21ఏళ్ల వయసున్నప్పుడే రాజీవ్‌ గాంధీతో ప్రేమలో పడ్డారని వెల్లడించారు.

‘ఆయన్ను పెళ్లి చేసుకునేందుకు సోనియా గాంధీ ఇటలీ నుంచి భారత్‌కు వచ్చారు. మన సంప్రదాయాలు నేర్చుకునేందుకు మొదట్లో చాలా కష్టపడ్డారు. ఇక్కడి పద్ధతులన్నీ నేర్చుకున్నారు. ఇందిరా గాంధీ నుంచి ఎన్నో ముఖ్య విషయాలను నేర్చుకున్నారు. కానీ, 44ఏళ్లకే భర్తను కోల్పోయారు. ఆమెకు రాజకీయాలు ఇష్టం లేనప్పటికీ దేశానికి సేవ చేసేందుకే నిర్ణయించుకున్నారు. అలా ఆమె తన జీవితాన్ని దేశసేవ కోసమే కొనసాగిస్తున్నారు’ అని సోనియా గాంధీ గురించి ప్రియాంక వాద్రా వివరించారు. జీవితంలో ఏం జరుగుతుంది, ఎంతటి విషాదాన్ని ఎదుర్కొంటామనేది ముఖ్యం కాదని.. ఇంటాబయట ఎటువంటి కష్టాలు వచ్చినా స్వయంగా ఎదుర్కోవచ్చంటూ మహిళలకు భరోసా ఇస్తూ మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని