Sri Lanka: ఎట్టకేలకు శ్రీలంకలో లాక్‌డౌన్‌ ఎత్తివేత.. కొనసాగనున్న ఆంక్షలు

భారీ సంఖ్యలో డెల్టా వేరియంట్‌ కేసులతో అల్లాడిపోయిన శ్రీలంకలో తాజాగా పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. దీంతో దాదాపు ఆరు వారాలుగా కొనసాగిన లాక్‌డౌన్‌ను శుక్రవారం ఎత్తేశారు. కానీ.. పౌరుల రాకపోకలు, సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతాయని..

Published : 01 Oct 2021 23:54 IST

కొలంబో: భారీ సంఖ్యలో డెల్టా వేరియంట్‌ కేసులతో అల్లాడిపోయిన శ్రీలంకలో తాజాగా పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. దీంతో దాదాపు ఆరు వారాలుగా కొనసాగిన లాక్‌డౌన్‌ను శుక్రవారం ఎత్తేశారు. కానీ.. పౌరుల రాకపోకలు, సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతాయని.. విధుల నిర్వహణ, నిత్యవసరాల కొనుగోలుకే బయటకు రావాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. పాఠశాలలు, సినిమా హాళ్లు, రెస్టారెంటులు మూసే ఉంటాయని చెప్పారు. డెల్టా వేరియంట్‌ కేసుల విజృంభణ దరిమిలా.. ఆగస్టు 20న శ్రీలంకలో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. సెప్టెంబరులో వైరస్‌ వ్యాప్తి మరింత ఉద్ధృతంగా కొనసాగింది. ఈ సమయంలో రోజుకు దాదాపు మూడు వేలకుపైగా కేసులు, 200కు పైగా మరణాలు నమోదయ్యాయి. దీంతో లాక్‌డౌన్‌ను మూడుసార్లు పొడగించాల్సి వచ్చింది. ఈ దేశంలో ఇప్పటివరకు మొత్తం 5.16 లక్షల మంది మహమ్మారి బారిన పడగా, 12,800కి పైగా మరణాలు నమోదయ్యాయి.

ఆర్థిక రంగానికి ఊతం లభించగలదని..

తాజాగా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం, దాదాపు 50 శాతానికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తవడంతో లాక్‌డౌన్‌ ఎత్తేశారు. దాదాపు 2.18 కోట్లకు పైగా జనాభా కలిగిన శ్రీలంక.. ఇటీవల ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. 2019లో ఉగ్రదాడులతో పర్యాటక రంగం కుదేలవడం, కరోనా విజృంభణ, విదేశీ రుణభారం పెరిగిపోవడం, విదేశీ మారకద్రవ్యం నిల్వలు పడిపోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అమెరికా డాలర్‌తో పోల్చితే శ్రీలంకన్‌ రూపీ విలువ కూడా పడిపోయింది. దీంతో దిగుమతులపై ప్రభావం పడి.. దేశంలో నిత్యావసరాల కొరత ఏర్పడింది. ప్రజలు దుకాణాల బయట బారులు తీరారు. అయితే.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎత్తివేత నిర్ణయంతో ఆర్థిక రంగానికి ఊతం లభించగలదని, విదేశీ మారక నిల్వల తరుగుదలను ఇది నిలువరించగలదని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు