బీఎస్‌ఎఫ్ అధికార పరిధి పెంపు: కుట్ర స్పష్టంగా తెలుస్తోందన్న కాంగ్రెస్‌

సరిహద్దు భద్రత దళం( బీఎస్‌ఎఫ్) అధికార పరిధిని విస్తృతం చేస్తూ బుధవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Published : 14 Oct 2021 15:22 IST

ఏకరూపత కోసమే ఈ సవరణ అని బీఎస్‌ఎఫ్‌ స్పష్టత

దిల్లీ: సరిహద్దు భద్రత దళం( బీఎస్‌ఎఫ్) అధికార పరిధిని విస్తృతం చేస్తూ బుధవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యను సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో గురువారం బీఎస్‌ఎఫ్ స్పందించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబటి ఉన్న రాష్ట్రాలు అంతటా అధికార పరిధికి ఏకరూపత కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత ఇచ్చింది. తాజాగా సవరణ వల్ల సరిహద్దు వెంట జరిగే నేరాలను సమర్థంగా నిలువరించడానికి వీలువుతుందని వెల్లడించింది. 

మన దేశ సరిహద్దుల వెంట రక్షణ విధులు నిర్వహించే బీఎస్‌ఎఫ్ ఇకపై పంజాబ్‌, పశ్చిమ్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో 50 కిలోమీటర్ల వరకు లోపలకు వచ్చి సోదాలు, జప్తులు చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. ఈ మూడు రాష్ట్రాల పరిధి ఇప్పటి వరకు 15 కిలోమీటర్ల వరకే ఉండేది. తాజాగా సవరణతో అది 50 కిలోమీటర్లకు పెరిగింది. ‘ఈ నిర్ణయం వల్ల సరిహద్దు వెంట జరిగే నేరాలను సమర్థవంతగా అడ్డుకోవడానికి వీలు కలుగుతుంది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, పశ్చిమ్‌ బెంగాల్, రాజస్థాన్‌, గుజరాత్, అస్సాంలో బీఎస్‌ఎఫ్ 50 కిలోమీటర్ల మేర కార్యకలాపాలను నిర్వహించగలదు. దాంతో భద్రతా దళం అధికార పరిధికి ఏకరూపత లభిస్తుంది’ అని బీఎస్‌ఎఫ్ వెల్లడించింది. 

కుట్ర స్పష్టంగా తెలుస్తోంది: కాంగ్రెస్‌

రాత్రికి రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కాలక్రమాన్ని గమనించండంటూ హెరాయిన్ పట్టివేత నుంచి బీఎస్‌ఎఫ్ అధికార పరిధి పెంపు వరకు జరిగిన పరిణామాలను వివరించింది’’ అంటూ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని