Lockdown in Sri Lanka: శ్రీలంకలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌..!

కరోనా వైరస్‌ మహమ్మారి మూడో ఉద్ధృతి దాటికి శ్రీలంక వణికిపోతోంది. వైరస్‌ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాలేదు. దీంతో దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 20 Aug 2021 20:12 IST

థర్డ్‌వేవ్‌ విజృంభణతో మరోసారి ఆంక్షలు

కొలంబో: కరోనా వైరస్‌ మహమ్మారి మూడో దశ ఉద్ధృతి దాటికి శ్రీలంక వణికిపోతోంది. వైరస్‌ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాలేదు. దీంతో దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.

గతకొన్ని రోజులుగా శ్రీలంకలో నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరిగిపోయాయి. కేవలం గురువారం ఒక్కరోజే దాదాపు 4వేల కేసులు, 186 మరణాలు రికార్డయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం, శ్రీలంకలో ఇప్పటివరకు 3లక్షల 73వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 6790 మంది మృత్యువాతపడ్డారు. కొలంబోలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. జూన్‌ తర్వాత పెరిగిన ఉద్ధృతితో మరణాల సంఖ్య పెరిగింది. దీంతో మార్చురీలు, శ్మశానవాటికలు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ మూడో ఉద్ధృతికి అడ్డుకట్ట వేయాలని వైద్య నిపుణులతో పాటు బౌద్ధ మతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని శీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆదేశించారు. దీంతో ఆగస్టు 20వ తేదీ రాత్రి పది గంటల నుంచి ఆగస్టు 30 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని జాతీయ కొవిడ్‌ నిర్మూలన కేంద్రానికి నేతృత్వం వహిస్తోన్న ఆర్మీ చీఫ్‌ జనరల్‌ శవేంద్ర సిల్వ వెల్లడించారు.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణతో ఆస్పత్రులు, మార్చురీలు, శ్మశాన వాటికలు కిటకిటలాడుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నప్పటికీ అధ్యక్షుడు గోటబాయ మాత్రం కఠిన చర్యలకు నిరాకరించారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో దేశంలో రోజురోజుకి ఆరోగ్య వ్యవస్థ మరింత దిగజారిపోతుందని కూటమి సభ్యులతో పాటు అక్కడ అత్యంత శక్తివంతమైన బౌద్ధ మతాధికారుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యింది. వీటిని కట్టడి చేసేందుకు మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో తప్పని పరిస్థితుల్లో శ్రీలంక అధ్యక్షుడు లాక్‌డౌన్‌కు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా శ్రీలంక ఇప్పటికే పలుమార్లు కర్ఫ్యూ ఆంక్షలు, లాక్‌డౌన్‌ విధించింది. ఇలా వరుస ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక రంగం నుంచి ప్రధాన ఆదాయం పొందే శ్రీలంక, కొవిడ్‌ ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని