Farm Laws: సాగుచట్టాల రద్దుతో నిరుత్సాహం లేదు : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం రూపొందించిన చట్టాలను రద్దు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వమేమీ నిరుత్సాహపడడంలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు.

Published : 24 Dec 2021 19:54 IST

వ్యవసాయ రంగంలోనే ప్రైవేటు పెట్టుబడులు తక్కువన్న తోమర్‌

నాగ్‌పూర్‌: వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం రూపొందించిన చట్టాలను రద్దు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వమేమీ నిరుత్సాహపడడంలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రయత్నించినప్పటికీ కొందరికి మాత్రం అవి నచ్చలేదని అన్నారు. ‘అగ్రోవిజన్‌’ పేరుతో నాగ్‌పూర్‌లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభించిన ఆయన.. అతితక్కువగా ప్రైవేటు పెట్టుబడులు కేవలం వ్యవసాయ రంగంలోనే ఉన్నాయని అన్నారు.

‘వ్యవసాయ సవరణల చట్టాలను తీసుకొచ్చాం. 70ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ సంస్కరణలకు పునాది వేశాం. కానీ, అవి కొందరికి నచ్చలేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం నిరుత్సాహపడడం లేదు. దేశానికి రైతులే వెన్నెముక కాబట్టి వారికోసం ఒకడుగు వెనక్కి వేశాం’ అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారీగా ప్రైవేటు పెట్టుబడులు రావాల్సి ఉందన్న ఆయన.. ఈ రంగంలోనే అతి తక్కువగా ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయని గుర్తుచేశారు. ఇతర రంగాలు మాత్రం ఎన్నో ఉద్యోగ, ఉపాధి కల్పిస్తోన్నాయని.. దీంతో జీడీపీ కూడా పెరుగుతోందని చెప్పారు.

వ్యవసాయ రంగమే అతిపెద్దది అయినప్పటికీ ఇందులో ఆశించిన అవకాశాలు కనిపించడం లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ పథకాల ద్వారానే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనడం, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులపై సబ్సిడీతో పాటు ఇతర కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న పెట్టుబడులు కేవలం వ్యాపారులకే ప్రయోజనం కలిగిస్తున్నాయన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో గిడ్డంగులు లేవని గుర్తుచేశారు. అందుకే వ్యవసాయంతోపాటు అనుబంధం రంగాలైన పశుపోషణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫిషరీస్‌, హెర్బల్‌ ఫార్మింగ్‌లలో రూ.లక్ష కోట్లతో మౌలిక పెట్టుబడులను ప్రధాని మోదీ ప్రకటించారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని