Corbevax: ప్రతి నెలా 10 కోట్ల కార్బివాక్స్‌ టీకా డోసుల ఉత్పత్తి

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు 10 కోట్ల కార్బివాక్స్‌ టీకా డోసులను తయారు చేయాలని అంచనా వేస్తున్నట్లు బయోలాజికల్‌-ఈ సంస్థ వెల్లడించింది......

Published : 28 Dec 2021 23:40 IST

దిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేలా భారత్‌ మరో రెండు టీకాలను ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో కొవొవ్యాక్స్‌తోపాటు హైదరాబాద్‌ కేంద్రంగా ఉత్పత్తి కానున్న కార్బివాక్స్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే టీకాను ఉత్పత్తి చేస్తున్న బయోలాజికల్‌-ఈ (బీఈ) సంస్థ స్పందించింది. నెలకు 7.5 కోట్ల కార్బివాక్స్‌ డోసులను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. ఉత్పత్తిని పెంచుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు 10 కోట్ల డోసులను తయారు చేయాలని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. కాగా వీటిల్లో భారత్‌కు 30 కోట్ల డోసులు అందిస్తామని సంస్థ గతంలోనే తెలిపింది. భారత్‌లో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్‌గా కార్బివాక్స్‌ నిలువనుంది.

తమ టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో బీఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు నాణ్యమైన వ్యాక్సిన్లు, ఔషధ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన టీకాను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది’ అని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు బయోలాజికల్‌-ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 50 మిలియన్‌ డాలర్లతో ఉత్పత్తి కేంద్రాన్ని విస్తరించేందుకు అమెరికా ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (DFC)తో ఒప్పందం కుదుర్చుకుంది. 2022 చివరి నాటికి భారత్‌తో పాటు ఇతర అభివృద్ధి చెందుతోన్న దేశాలకు దాదాపు 100కోట్ల కంటే ఎక్కువ వ్యాక్సిన్‌ డోసులను అందించేందుకు తమ భాగస్వామ్యం దోహదపడుతుందని డీఎఫ్‌సీ ప్రతినిధి డేవిడ్‌ మార్కిక్‌ గతంలో ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని