Didi Vs HM: మదర్‌ థెరీసా ఛారిటీ వివాదం.. దీదీ వ్యాఖ్యలకు హోంశాఖ కౌంటర్‌!

మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి చెందిన అకౌంట్లను ఫ్రీజ్‌ చేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

Published : 28 Dec 2021 01:29 IST

దిల్లీ: మదర్‌ థెరీసా స్థాపించిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి చెందిన బ్యాంకు అకౌంట్లను కేంద్రం నిలిపివేయడం దారుణమని మమతా బెనర్జీ ఆరోపించారు. దీంతో వేలమంది రోగులతో పాటు సంస్థ సిబ్బందికి ఆహారం, ఔషధాలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీదీ ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి చెందిన అకౌంట్లను ఫ్రీజ్‌ చేయలేదని స్పష్టం చేసింది. ఆయా బ్యాంకు అకౌంట్లను నిలిపివేయాలని కోరుతూ ఆ సంస్థనే ఎస్‌బీఐకి లేఖ రాసినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో తమ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలేమీ నిలిచిపోలేదని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ చెప్పడం గమనార్హం.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద సంస్థ లైసెన్సు రెన్యువల్‌ కోసం మదర్ థెరీసా నెలకొల్పిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. అయితే, వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. రెన్యువల్‌ చేసేందుకు నిరాకరించింది. సంస్థపై పలు ఫిర్యాదులు రావడంతోపాటు ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా లేకపోవడంతో డిసెంబర్‌ 25న రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ను తిరస్కరించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అనంతరం తిరస్కరణను సమీక్షించాలని కానీ, మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థన ఆ సంస్థ నుంచి ఇప్పటికీ రాలేదని పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్‌ 31కే లైసెన్స్‌ ముగిసినప్పటికీ డిసెంబర్‌ 31వరకూ ఆ సంస్థ రిజిస్ట్రేషన్‌కు పొడిగించిన విషయాన్ని కేంద్ర హోంశాఖ గుర్తుచేసింది. ఇదే సమయంలో తమ అకౌంట్లను నిలిపివేయాలంటూ ఛారిటీనే ఎస్‌బీఐని కోరినట్లు స్పష్టం చేసింది.

క్రిస్మస్‌ రోజునే మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ అకౌంట్లను కేంద్రం ఫ్రీజ్‌ చేశారనే విషయం తననెంతో షాక్‌కు గురిచేసిందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. దీంతో 22 వేలమంది రోగులు, ఉద్యోగుల ఆహారం, ఔషధాలకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టమే ప్రధానమైనప్పటికీ మనవతా ప్రయత్నాల్లో రాజీ పడకూడదంటూ ట్వీట్‌ చేశారు. దీనికి బదులిచ్చిన కేంద్ర హోంశాఖ.. బ్యాంకు ఖాతాలేమీ నిలిపివేయలేదని స్పష్టం చేసింది. అయితే, ఛారిటీకి చెందిన బ్యాంకు అకౌంట్లన్నీ ఫ్రీజ్‌ చేశారని మమతా బెనర్జీ ఆరోపించడంపై అటు మదర్‌ థెరీసా ఛారిటీ స్పందించింది. ప్రస్తుతం అకౌంట్లన్నీ బాగానే పనిచేస్తున్నాయని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని.. ప్రస్తుతానికి బ్యాంకు లావాదేవీలు సజావుగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని