Published : 10/12/2021 01:36 IST

Twitter: కోహ్లీ చెప్పిన శుభవార్త, పాట్‌ కమిన్స్ విరాళం.. భారతీయుల్ని మెప్పించాయి..!

అత్యధిక రీట్వీట్లు, లైక్స్ పొందిన ట్వీట్లు ఏంటో తెలుసా..?

దిల్లీ: ఈ డిజిటల్ యుగంలో నెట్టింటికే అత్యధిక ప్రాధాన్యం. ప్రభుత్వాలు, అభిమాన నటులు, ఆటగాళ్లు.. ఇలా ఎవరు ఏ కొత్త విషయం చెప్పినా వెంటనే నెటిజన్లకు చేరిపోతుంది. వారిని మెప్పిస్తే ట్రెండ్ అవుతుంది. ట్వీట్ల సంగతి అంతే. అందుకే.. 2021లో భారతీయులు ఎక్కువగా రీట్వీట్‌ చేసిన ట్వీట్‌, వారిని ఆకట్టుకున్న ట్వీట్‌, ట్రెండ్‌ అయిన హ్యాష్‌ ట్యాగ్స్‌ను ట్విటర్ వెల్లడించింది. అంతగా నెటిజన్లను ఆకట్టుకున్న అంశాలు, చర్చించిన విషయాలు ఏంటో తెలియాలంటే ట్విటర్ చెప్పిన వివరాలు చదవాల్సిందే..!

పాట్‌ కమిన్స్‌ ట్వీట్‌కు భారత్‌లో ఎక్కువ రీట్వీట్లు:

భారత్‌ కరోనా రెండో దశలో తీవ్రంగా అల్లాడిపోయింది. ఆ సమయంలో ఎంతోమంది ప్రముఖులు ముందుకు వచ్చి, ఆపత్కాలంలో అండగా నిలిచారు. ఆక్సిజన్ కొరతతో సతమతమయిన భారత్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్‌ కమిన్స్ పీఎం కేర్స్‌కు 50 వేల డాలర్లు విరాళంగా ప్రకటించారు. ఆ సందర్భంగా పెట్టిన ట్వీట్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ‘భారత్‌.. ఏళ్లుగా నేను ప్రేమిస్తూ వస్తున్న దేశం. నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో అత్యంత దయ, మంచి మనసు కలిగినవారు ఇక్కడి ప్రజలు. అలాంటి వారు ఇప్పుడు బాధలో ఉన్నారని తెలియడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది’ అంటూ మనదేశంపై తన ప్రేమను చాటాడు. తన ఆటతో భారతీయుల అభిమానాన్ని పొందిన కమిన్స్‌.. దాతృత్వంలోనూ వారి ప్రేమకు పాత్రుడయ్యాడు. కమిన్స్ చేసిన ట్వీట్‌ భారత్‌లో అత్యధికంగా రీట్వీట్‌ చేసిన ట్వీట్‌గా నిలిచింది. అది 1,14,000 సార్లు రీట్వీట్‌ అయింది.

కోహ్లీ శుభవార్తకు లైక్స్‌ వర్షం..

భారత స్టార్‌ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ తన ఆటతో వెలకట్టలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ట్విటర్‌లో తనకు కుమార్తె జన్మించిన విషయాన్ని వెల్లడించి, అభిమానులకు శుభవార్త చెప్పారు. దానిపై నెటిజన్లు లైక్స్ వర్షం కురిపించారు. 5,38,200 లైక్స్‌తో 2021లో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది. మరోవిషయం ఏంటంటే.. కోహ్లీ గతేడాది తన భార్య అనుష్క శర్మ గర్భం దాల్చిన విషయాన్ని ట్విటర్‌లో పంచుకోగా.. దానికే 2020లో అత్యధికులు లైక్‌ కొట్టారు.

ప్రభుత్వంలో మోదీ ట్వీట్లదే హవా..

ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా మొదటి డోసును స్వీకరించారు. దేశంలో అర్హులంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. అది ఎంతో మందికి చేరువైంది. అందుకే ప్రభుత్వానికి సంబంధించి అత్యధికులు రీట్వీట్ చేసిన ట్వీట్‌గా మారింది. ఇప్పటివరకు దాన్ని 45,100 మంది రీట్వీట్ చేశారు. అలాగే టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గబ్బా స్టేడియంలో భారత్ సాధించిన విజయంపై మోదీ స్పందించారు. ఈ విజయం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఇది కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎక్కువమంది ఇష్టపడిన ట్వీట్. దీనిని 2,98,000 మంది లైక్ చేశారు.

బిజినెస్‌ రంగంలో మెప్పించిన ట్వీట్ ఆయనదే..

ఈ ఏడాది విమానయాన సంస్థ ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్‌ చేసుకోవడంపై వ్యాపార వర్గాలు అమితాసక్తిని ప్రదర్శించాయి. అందుకు తగట్టే దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఆ సంస్థ సొంత యజమానుల చెంతకు చేరింది. దీనిపై టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా స్పందిస్తూ.. ‘వెల్‌కమ్ బ్యాక్ ఎయిరిండియా’ అని ట్వీట్ చేశారు. ఇదే ఈ ఏడాది బిజినెస్ రంగంలో అత్యధికులు రీట్వీట్‌, లైక్‌ చేసిన ట్వీట్. 

> తమిళ స్టార్ నటుడు విజయ్ తన తదుపరి చిత్రం బీస్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌పై ట్వీట్ చేశారు. వినోద రంగంలో దానికే అత్యధిక రీట్వీట్‌లు, లైక్స్‌ దక్కాయి.

> ఐపీఎల్‌లో క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఆటను అభినందిస్తూ విరాట్‌ చేసిన ట్వీట్‌ .. క్రీడా విభాగంలో అత్యధిక రీట్వీట్‌లు, లైక్స్‌ దక్కించుకుంది. 

హ్యాష్‌ ట్యాగ్‌లు, ఎమోజీలు ఇవే.. 

COVID19, FarmersProtest, TeamIndia, Tokyo2020, IndianArmy, Uttarakhand, Bitcoin, NFT వంటి తదితర హ్యాష్ ట్యాగ్‌లు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. అలాగే ఫోల్డెడ్ హ్యాండ్ ఎమోజీని ఎక్కువ మంది వాడగా.. ఆ తర్వాత లవ్‌, ఫైర్ ఎమోజీలను నెటిజన్లు తమ సందేశాల్లో ఉపయోగించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని