G-20 Summit: ఈ నెల 29నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన!

రోమ్‌లో జరుగనున్న 16వ జీ-20 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న ఇటలీ బయలుదేరనున్నారు.

Updated : 24 Oct 2021 19:11 IST

జీ-20 సదస్సులో పాల్గొననున్న నరేంద్ర మోదీ

దిల్లీ: రోమ్‌లో జరుగనున్న 16వ జీ-20 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న ఇటలీ బయలుదేరనున్నారు. ఐదురోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత రోమ్‌కు అక్కడ నుంచి యూకే, స్కాట్‌లాండ్‌లోనూ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కాప్‌-26 సదస్సులోనూ ప్రధాని మోదీ నేరుగా పాల్గొంటారు.

రోమ్‌లో ఈ నెల 30-31 తేదీల్లో జరుగనున్న జీ-20 సదస్సులో ప్రధాని మోదీ తొలుత పాల్గొంటారు. ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరుగుతోన్న ఈ సదస్సులో మహమ్మారి విలయం నుంచి కోలుకోవడం, ఆరోగ్యం విషయంలో అంతర్జాతీయ సహకారం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వాతావరణ మార్పు, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా నిలువనున్నాయి. సభ్యదేశాల అధ్యక్షులు, ప్రభుత్వాధినేతలు పాల్గొనే ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం ఎనిమిదవసారి కావడం విశేషం. ఇక 2023లో తొలిసారిగా భారత్‌ ఈ సదస్సుకు వేదిక కానుంది.

జీ-20 సదస్సు అనంతరం స్కాట్లాండ్‌లోని గ్లాస్గోకు బయలుదేరుతారు.  అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 12వరకు జరుగనున్న కాప్‌-26 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. వరల్డ్‌ లీడర్స్‌ సమ్మిట్‌ (WLS) పేరుతో నవంబర్‌ 1-2వ తేదీల్లో జరిగే ప్రధాన సమావేశానికి హాజరవుతారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 దేశాధినేతలు హాజరుకానున్నారు. వాస్తవానికి కాప్‌-26 గతేడాదే జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా వాయిదా పడింది. ఇక విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్‌, ఇటలీతో పాటు ఇతర దేశాల అధినేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని