Chandrayaan-3: చందమామ ‘పెరట్లో’ రోవర్‌ ఆటలు.. ఇస్రో నుంచి మరో వీడియో

Chandrayaan-3: చంద్రయాన్‌-3కి సంబంధించి మరో కొత్త వీడియోను ఇస్రో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో జాబిల్లి ఉపరితలంపై రోవర్‌ చక్కర్లు కొడుతున్న దృశ్యాలున్నాయి.

Updated : 31 Aug 2023 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాబిల్లి (Moon) ఉపరితలంపై దిగిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Rover) తన పరిశోధనల్లో నిమగ్నమైంది. ఈ 14 రోజుల కాలవ్యవధిలో చంద్రుడిపై రోవర్‌ పూర్తి చేయాల్సిన పరిశోధనల లిస్ట్‌ పెద్దగానే ఉంది. అందుకే.. జాబిల్లి ఉపరితలంపై అటూ ఇటూ తిరుగుతూ అన్వేషణలు సాగిస్తోంది. అయితే, బండరాళ్లు, బిలాలతో నిండిన చందమామపై తాను నడవాల్సిన సురక్షిత మార్గాన్ని కూడా సక్రమంగా ఎంచుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇస్రో (ISRO) తాజాగా ఎక్స్‌ (ట్విటర్‌)లో పంచుకుంది.

‘‘సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ రోవర్‌ తిరుగుతోంది. ప్రజ్ఞాన్‌ భ్రమణాన్ని ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా బంధించింది. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే.. చందమామ పెరట్లో చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది కదా ఈ వీడియో’’ అంటూ ఇస్రో సరదగా రాసుకొచ్చింది. 

బ్రో.. నవ్వు బ్రో.. విక్రమ్‌ ఫొటోలు తీసిన ప్రజ్ఞాన్‌

జాబిల్లిపై సల్ఫర్‌ ఎలా?

చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ఉపరితలంపై మొట్టమొదటిసారిగా జరిపిన పరిశోధనల్లో సల్ఫర్‌ ఉనికిని రోవర్‌లోని కీలమైన లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (లిబ్స్‌) గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రజ్ఞాన్‌లోని మరో పరికరం కూడా దీన్ని ధ్రువీకరించింది. మరో టెక్నిక్‌తో జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్‌ ఉన్నట్లు గుర్తించింది. ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్‌ (APXS) దీన్ని ధ్రువీకరించినట్లు ఇస్రో తెలిపింది. ‘‘జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్‌ ఎలా వచ్చింది..?అంతర్గతంగానే ఉందా?అగ్విపర్వతం లేదా ఉల్కల వల్లనా? వంటి అంశాలను పరిశోధించేందుకు తాజా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సి ఉంది’’ అని ఇస్రో తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని