Modi: ప్రధాని ఐరోపా పర్యటన.. వైరల్‌గా మారిన 30 ఏళ్లనాటి ఫొటో

ప్రధాని మోదీ జర్మనీకి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అది దాదాపు 30 ఏళ్ల క్రితం నాటి ఫొటోగా తెలుస్తోంది........

Published : 03 May 2022 19:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా దేశాల పర్యటనకు వెళ్లడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదివారం జర్మనీకి వెళ్లిన మోదీ.. అక్కడి నుంచి డెన్మార్క్‌ చేరుకున్నారు. అయితే మోదీ జర్మనీకి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అది దాదాపు 30 ఏళ్ల క్రితం నాటి ఫొటోగా తెలుస్తోంది. 1993లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో మోదీ ఈ ఫోటో దిగారు. రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన పశ్చిమ ఐరోపాలోని మధ్యయుగ చక్రవర్తి చార్లెమాగ్నే విగ్రహం ముందు యువ మోడీ, ఆయన సహచరుడు నిలబడి ఫొటోకు ఫోజిచ్చారు.

ఈ ఫొటో దిగిన సమయంలో మోదీ కేవలం భాజపా కార్యకర్త మాత్రమే. కానీ ఈ 30 ఏళ్లలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ప్రధానమంత్రి హోదాలో ఆ దేశంలో పర్యటించారు. అక్కడి సైనికుల చేత గౌరవ వందనం స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫొటోలు సహా, ఆ పాత ఫొటో నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని  పంచుకుంటున్న నెటిజన్లు ‘అప్పుడు, ఇప్పుడు’ అని పేర్కొంటూ పోస్టులు పెడుతున్నారు.

మూడురోజుల పర్యటనలో భాగంగా ప్రధానిమోదీ సోమవారం జర్మనీ వెళ్లారు. ఆ దేశ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో భేటీ అయ్యారు. అనంతరం డెన్మార్క్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి ఫ్రాన్స్‌ వెళ్లనున్నారు. ఈ క్రమంలో మొత్తం 8మంది ప్రపంచనేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యాను ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న తరుణంలో భారత ప్రధాని ఐరోపా దేశాధినేతలతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు