‘ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు’

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా పూర్తయింది. 29 ఏళ్ల తర్వాత తొలిసారి.......

Published : 05 Aug 2020 21:09 IST

దిల్లీ‌: రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడం ద్వారా ప్రధాని మోదీ భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఈ రోజు ఎంతో చరిత్రాత్మకమైదని.. గర్వించదగగిన రోజు అని తెలిపారు. కరోనా సోకడంతో గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వం వల్లే రామ మందిరం నిర్మాణం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. భారత దేశ సంస్కృతి, విలువలను పరిరక్షించేందుకు మోదీ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. రామాలయం నిర్మాణం శతాబ్దాల త్యాగం, పోరాటం ఫలితమేనన్న షా.. దీనికోసం ఎంతోమంది భక్తులు త్యాగాలు చేశారని గుర్తుచేసుకున్నారు.

ఎన్నో ఏళ్ల పోరాటం కార్యరూపం దాల్చిన వేళ..

అయోధ్యలో మందిరం నిర్మాణానికి భూమిపూజ ఘట్టంతో ఎన్నో ఏళ్ల పోరాటం కార్యరూపం దాల్చిందని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ అన్నారు. ఈ రోజు సువర్ణాక్షరాలతో చరిత్ర పుటల్లో లిఖించదగినదన్నారు. రామమందిరం నిర్మాణం ప్రారంభించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా భాజపా ఎల్లప్పుడూ తన వాగ్ధానాలను నిలబెట్టుకుంటుందని రుజువైందని తెలిపారు. 

ప్రజల కల సాకారమైంది..

దేశ ప్రజలందరికీ ఈ రోజు ముఖ్యమైన రోజు అని అసోం సీఎం సర్వానంద్‌ సోనోవాల్‌ అన్నారు. రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కోసం ప్రజలంతా ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారని చెప్పారు. ఆ కల నేడు సాకారమైందని.. ప్రజల స్వప్నాన్ని సాకారం చేయడం ద్వారా మోదీ గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.  దేశంలో శాంతిని, మానవత్వాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ ఆలయం ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని