
China: చైనా ఒంటెద్దు పోకడ.. టిబెటన్లకు తిప్పలు!
ఇంటర్నెట్ డెస్క్: వాతావరణ మార్పులపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ గళమెత్తుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఇదే ముసుగులో చైనా తమ భూములను లాక్కోవడానికి యత్నిస్తోందని టిబెటన్లు ఆరోపిస్తున్నారు. తద్వారా తమ ప్రాథమిక హక్కులను, జీవనోపాధిని దెబ్బతీస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే తమ భూములపై యాజమాన్య హక్కులను బలవంతంగా వదులుకోవాల్సి వచ్చిందని, దీంతోపాటు పశువుల మేతకు గడ్డి మైదానాలనూ వినియోగించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. వాస్తవానికి, చైనా తన నీటి అవసరాలకు టిబెట్‌లోని నీటి వనరులపై ఆధారపడి ఉంది. దీంతో.. అక్కడి గడ్డి భూములను జాతీయ ఉద్యానాలుగా ప్రకటించింది. గడ్డి భూముల పరిరక్షణ విధానం కింద.. భూ అనుమతులను రద్దు చేయడం, పంటపొలాలు, గడ్డి మైదానాలను జప్తు చేయడం ప్రారంభించింది. ఈ చర్యలన్నీ టిబెటన్ల జీవితాలను, జీవనోపాధిని అస్తవ్యస్తం చేశాయని మీడియా సంస్థ ‘టిబెట్ ప్రెస్’ పేర్కొంది.
పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ..
టిబెటన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ(టీసీహెచ్‌ఆర్‌డీ) ప్రకారం.. చైనా ప్రభుత్వం తన కర్బన ఉద్గారాలను తగ్గించడం పేరుతో టిబెటన్లను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక, మార్కెట్ ఆధారిత వ్యవస్థలను అనుమతించడంతోపాటు టిబెటన్ల జీవన విధానాన్ని పునర్నిర్మించేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడి సంచార పశుపోషకులను పట్టణ ప్రాంతాలకు తరలిస్తోంది. దీంతో వారికి భూ యాజమాన్య భద్రత, ఆహార భద్రత, ఇతర సామూహిక హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి! పట్టణీకరణ, స్థానిక సాంప్రదాయక జీవన విధానాలకు భంగం కలిగించడం వంటి చర్యలు టిబెట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చైనా సేనలు 1950లో టిబెట్‌ను ఆక్రమించుకుని, తదనంతరం దాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 1959లో టిబెటన్ తిరుగుబాటు జరిగినా.. విఫలమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.