Booker Prize: ‘టూంబ్‌ ఆఫ్ సాండ్‌’ భారతీయ నవలకు ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌

భారతీయ రచయిత్రి గీతాంజలి శ్రీని అంతర్జాతీయ పురస్కారం బుకర్ ప్రైజ్ వరించింది.

Updated : 27 May 2022 13:08 IST

 ఈ ఘనత సాధించిన తొలి హిందీ నవల

దిల్లీ: భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీని అంతర్జాతీయ పురస్కారం బుకర్ ప్రైజ్ వరించింది. ఆమె రచించిన ‘టూంబ్‌ ఆఫ్ సాండ్‌’కు ఈ ఘనత దక్కింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకున్న తొలి హిందీ నవల ఇది. రేత్‌ సమాధి పేరిట గీతాంజలి 2018లో ఈ నవలను రచించారు. తర్వాత అది ‘టూంబ్‌ ఆఫ్ సాండ్‌’గా ఆంగ్లంలోకి తర్జుమా అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు చేరువైన ఈ పుస్తకం 2022 ఏడాదికి గానూ అవార్డును పొందింది. దీనికింద 50 వేల పౌండ్ల నగదు బహుమతి లభించగా.. ఆంగ్ల అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌తో కలిసి గీతాంజలి ఈ మొత్తాన్ని పంచుకోనున్నారు. 

ఈ రేత్‌ సమాధి వృత్తాంతం.. భర్తను కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. భర్త మరణంతో కుంగిపోయిన ఆమె.. ఆ ప్రతికూల పరిస్థితులను దాటుకొని కొత్త జీవితాన్ని ప్రాంభించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె విభజన సమయంలో వదిలివచ్చిన గతాన్ని వెతుక్కుంటూ పాకిస్థాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఈ ప్రయాణాన్ని గీతాంజలి హృద్యంగా మలిచిన తీరు న్యాయనిర్ణేతలను మెప్పించింది.

గీతాంజలి ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించారు. ఆమె చిన్నపిల్లల కథలు, రేత్‌ సమాధితో కలిపి ఐదు నవలలు రచించారు. ఈ పురస్కారం దక్కడంపై అమితమైన సంతోషం వ్యక్తం చేశారు. ‘బుకర్ ప్రైజ్ వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. దీనిని గెలుస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది గొప్ప గౌరవం’ అని స్పందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు