ఐటీ చట్టాలు పాటించడంలో ట్విటర్‌ విఫలం: కేంద్రం 

నూతనంగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించడంలో ట్విటర్‌ విఫలమైందని కేంద్రం పేర్కొంది. ఐటీ చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని తెలిపింది. ఐటీ నిబంధనల......

Published : 05 Jul 2021 20:25 IST

దిల్లీ: నూతనంగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించడంలో ట్విటర్‌ విఫలమైందని కేంద్రం పేర్కొంది. ఐటీ చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని తెలిపింది. ఐటీ నిబంధనలు పాటించకపోవడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుందని, దీని ప్రకారం ట్విటర్‌ మధ్యవర్తిత్వ హోదా కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఐటీ నిబంధనలను ట్విటర్‌ పాటించడం లేదన్న పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

నూతన ఐటీ చట్టం కింద మూడు నెలల్లో నిబంధనలు కట్టుబడాల్సిందిగా సమయం ఇస్తూ ఫిబ్రవరి 25న నిబంధనలను నోటిఫై చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్‌లో  పేర్కొంది. మే 26న ఆ గడువు ముగిసినప్పటికీ ట్విటర్‌ వాటిని పూర్తిగా పాటించలేదని తెలిపింది. ట్విటర్‌ తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిని, తాత్కాలిక నోడల్‌ కాంటాక్ట్‌ అధికారిని నియమించిందని, వారు వైదొలగడంతో అమెరికాకు చెందిన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించిందని పేర్కొంది. భారతీయేతర వ్యక్తులను నియమించడమంటే ఐటీ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని కేంద్రం తెలిపింది. మరోవైపు ఇప్పటికే ట్విటర్‌ తన అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాత్కాలిక చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపింది. మంగళవారం ఈ అంశం విచారణకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు