ఒకే రోజు వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు మాజీ సీఎంలకు తప్పిన ముప్పు

గుజరాత్‌కు చెందిన ఇద్దరు మాజీ సీఎంలు విజయ్‌ రూపానీ, సురేశ్‌ మెహతా ఒకే రోజు రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

Published : 06 Nov 2023 21:30 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాష్ట్రానికి గతంలో మఖ్యమంత్రులుగా పనిచేసిన విజయ్‌ రూపానీ, సురేశ్‌ మెహతా రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డారు. సోమవారం వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. 2016 నుంచి 2021 వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్‌ రూపానీ కాన్వాయ్‌ అహ్మదాబాద్‌- రాజ్‌కోట్‌ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. సురేంద్రనగర్‌ జిల్లా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటేందుకు ప్రయాణిస్తుండగా.. మాజీ సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో రూపానీ వేరే కారులో ఉన్నారు. గాయపడిన వ్యక్తిని ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన రూపానీ.. అతడిని హాస్పిటల్‌కి తరలించారు. చిన్న చిన్న గాయాలతో ఆ వ్యక్తి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. 

మాజీ సీఎం మెహతా సైతం మరో ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. మోర్బీ జిల్లా హల్వద్‌ పట్టణం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. కారు మలుపు తీసుకుంటున్న తరుణంలో.. అదే సమయంలో వెనుక వస్తున్న ట్రక్కు ఆయన కారును ఢీకొట్టింది. కారును చూసి ట్రక్కు డ్రైవర్‌ అప్రమత్తమైన బ్రేక్‌ వేసినప్పటికీ.. భారీ వాహనం కావడంతో కంట్రోల్‌ అవ్వకపోవడంతో స్వల్ప వేగంతో వెళ్లి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం అక్కడి నుంచి వేరే వాహనంలో మెహతా ప్రయాణించారని చెప్పారు. గుజరాత్‌ రాష్ట్రానికి 1995 నుంచి 1996 మధ్య సుమారు ఏడాది పాటు మెహతా సీఎంగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని