Maharashtra: ప్రజల చేతుల్లోనే మూడో ముప్పు! 

రానున్న రోజుల్లో మూడో ముప్పు పొంచివున్నందున పౌరులు అలసత్వం ప్రదర్శించవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు.

Published : 31 May 2021 01:06 IST

15 రోజులు ఆంక్షల పొడిగింపు - సీఎం ఉద్ధవ్‌

ముంబయి: రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్న వేళ.. ప్రస్తుత ఆంక్షలను మరో 15రోజులు పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రానున్న రోజుల్లో మూడో ముప్పు పొంచి ఉన్నందున పౌరులు అలసత్వం ప్రదర్శించవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ రికవరీ రేటు 92 శాతం ఉండడం ఊరట కలిగించే విషయమని అభిప్రాయపడ్డారు. ఈసారి కఠిక లాక్‌డౌన్‌కు బదులు ఆంక్షలను మాత్రమే కొనసాగిస్తున్నామని.. ప్రజల ప్రవర్తనపైనే మూడో ముప్పు ఆధారపడి ఉందని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.

‘థర్డ్‌ వేవ్‌ ఎప్పుడు, ఏ తేదీన వస్తుందో నాకు తెలియదు. అందుచేత జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించకూడదు. కొవిడ్‌కి వ్యతిరేకంగా పౌరుల ప్రవర్తన పైనే మూడో ముప్పు ఆధారపడి ఉంది’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతకొన్ని రోజులుగా పలు జిల్లాల్లో కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించడం పట్ల వారికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత, ఆంక్షల కొనసాగింపుపై మాట్లాడిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌ అధిక తీవ్రత చూపించినట్లయితే ఆక్సిజన్‌ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నిత్యం 1700మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం కావడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. థర్డ్‌వేవ్‌కు చిన్నారులు ప్రభావితమవుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో చిన్నారులు వైరస్‌ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ అలాంటి ప్రభావం చూపిస్తే.. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు.

రెండు నెలల తర్వాత కనిష్ఠ కేసులు..

మహారాష్ట్ర పలు జిల్లాల్లో వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18,600 పాజిటివ్‌ కేసులు, 402 మరణాలు చోటుచేసుకున్నాయి. మార్చి 16 తర్వాత కేసుల సంఖ్య 18వేలకు తగ్గడం ఇదే తొలిసారి. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ నిత్యం 400లకు పైగా కొవిడ్‌ మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే విషయం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3లక్షల 25వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోగా.. కేవలం మహారాష్ట్రలోనే 94,844 మంది మృత్యువాతపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని