నోట్లరద్దు వల్లే నిరుద్యోగం పెరుగుతోంది

నాలుగేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్లే దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోందని మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ ఆరోపించారు.

Published : 02 Mar 2021 23:08 IST

కేంద్రంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విమర్శలు

తిరువనంతపురం: నాలుగేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్లే దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోందని మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ ఆరోపించారు. కేరళలో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ నిర్వహించిన ఓ సదస్సులో మన్మోహన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

రుణ సమస్యల నుంచి బయటపడేందుకు కేంద్రప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన తాత్కాలిక చర్యలు.. దీర్ఘకాలంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై పెను ప్రభావం చూపనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2016లో కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, అసంఘటిత రంగంలో వృద్ధి నెమ్మదిస్తోందని  ఆరోపించారు. ‘‘సమాఖ్య విధానం, రాష్ట్రాలతో నిరంతర సంప్రదింపులే దేశ ఆర్థిక, రాజకీయతత్వానికి మూలసంభాలు. రాజ్యాంగం కూడా ఇదే చెబుతోంది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలకు ఏ మాత్రం అనుకూలంగా లేదు’’ అని మాజీ ప్రధాని విమర్శించారు. ఈ సదస్సులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని