Kishan Reddy: విదేశాలకు తరలిన పురాతన వస్తువులను తెప్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది: కిషన్‌రెడ్డి

భారత్‌ నుంచి ఇతర దేశాలకు అక్రమంగా తరలిన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే పురాతన వస్తువులను తిరిగి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 

Updated : 01 Aug 2023 00:38 IST

దిల్లీ: గత పదేళ్లలో దేశంలోని ప్రముఖ కట్టడాలు, చిహ్నాలు, దేవాలయాల్లో ఉన్న 31 పురాతన వస్తువులు అపహరణకు గురయ్యాయయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘2013-2023 వరకు భారత పురావస్తు శాఖ(ASI) ఆధ్వర్యంలోని రక్షణ ఉండే ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, దేవాలయాలు తదితర వాటిల్లో 31 పురాతన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. వాటిలో ఇంకా 27 వస్తువులను రికవరీ చేయాల్సి ఉంది. అయితే వీటికి సంబంధించి అక్రమ రవాణాపై సరైన సమాచారం లేదు’’ అని మంత్రి సమాధానమిచ్చారు.

భారత్‌ నుంచి ఇతర దేశాలకు అక్రమంగా తరలిన మన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే పురాతన వస్తువులను తిరిగి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. ఇలాంటి పురాతన వస్తువులను ఇతర దేశాల్లో గుర్తిస్తే వెంటనే వాటిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఆయా దేశాలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం పురాతత్వశాఖ విదేశాంగ శాఖ సహకారంతో ఆయా దేశాల్లోని భారత ఎంబసీలతో మాట్లాడి వాటిని వెనక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. అలా 1976 నుంచి 2023 వరకు ఇతర దేశాలకు అక్రమంగా తరలిన మొత్తం 251 పురాతన వస్తువులను పురావస్తు శాఖ భారత్‌కు రప్పించిందని మంత్రి వివరించారు. ఇక 2021లో అమెరికా నుంచి 157, 2022లో ఆస్ట్రేలియా నుంచి 29 పురాతన వస్తువులను భారత్‌కు తీసుకొచ్చినట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఆయన పూర్తి డేటాను విడుదల చేశారు.  

చారిత్రక నేపథ్యమున్న కట్టడాలు, ఆలయాలకు అవసరాన్ని బట్టి భారత పురావస్తుశాఖతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు, ప్రైవేట్‌ సెక్యూరిటీ రక్షణగా ఉంటున్నట్లు మంత్రి తెలిపారు. ఎప్పుడైనా పురాతన వస్తువు దొంగతనానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అలా దొంగిలించిన వస్తువులను గుర్తించేందుకు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కస్టమ్‌ శాఖ, ఇతర నిఘా సంస్థలకు లుక్ ఔట్‌ నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు. గత పదేళ్లలో దొంగతనానికి గురైన 31 పురాతన వస్తువుల్లో 14 కర్ణాటకలోని ప్రముఖ కట్టడాల నుంచే ఉన్నట్లు తెలిపారు. వాటిలో ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని