LPG Cylinder: వంటగ్యాస్‌ ధర పెంపుతో.. కేంద్ర ప్రభుత్వం దోపిడీ : కాంగ్రెస్‌

వంటగ్యాస్‌ (LPG Cylinder) ధరలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే వంటగ్యాస్‌ ధరను రూ.500 దిగువకు తీసుకువస్తామని పేర్కొంది.

Published : 01 Mar 2023 22:00 IST

దిల్లీ: వంటగ్యాస్‌ సిలిండర్‌ (LPG Cylinder) ధరలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఆరోపించింది. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వీటి ధరను రూ.500 దిగువకు తీసుకువచ్చి వారి దోపిడీని అంతం చేస్తామని పేర్కొంది. తాజాగా వంటగ్యాస్‌ సిలిండర్లపై రూ.50 పెరిగిన నేపథ్యంలో స్పందించిన కాంగ్రెస్‌.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు (Elections) ముగిసిన వెంటనే సిలిండర్‌ ధరను పెంచడం పట్ల తీవ్ర విమర్శలు గుప్పించింది.

దేశ ప్రజలు అధిక ద్రవ్యోల్బణంతో (Inflation) సతమతమవుతోన్న వేళ.. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.50, వాణిజ్య గ్యాస్‌ ధర రూ.350 పెంచడం దారుణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు. ‘హొలీ పండుగను ఎలా జరుపుకోవాలి.., ఈ దోపిడీ ఎంతకాలం..’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రతి ఒక్క పౌరుడూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు.

ఎల్‌పీజీ (LPG) ధరలు పెరుగుదలతో ప్రజలకు మోదీ హొలీ (Holi) కానుక అందించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిలిండర్ ధరను రూ.500 కిందకు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం దీని అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. అధిక పన్నులతో దేశ ప్రజలను దోపిడీ చేయడం ఆపాలని డిమాండు చేశారు.

భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్‌ సిలిండర్‌ ధరను 275 శాతం పెంచిందని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వంటగ్యాస్‌ ధర రూ.400గా ఉంటే ప్రస్తుతం అది రూ.1100లకు చేరిందన్నారు. ఇలా ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారో అనే విషయాన్ని ప్రధానమంత్రి చెప్పాలని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, గతేడాది జులై తర్వాత దేశంలో వంటగ్యాస్‌ ధరలు పెరగలేదు. తాజా పెంపుతో పలు నగరాల్లో ఎల్‌పీజీ ధర రూ.1150 దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని