సమయమివ్వండి.. విచారణకు వస్తా: దీప్‌ సిద్ధూ

గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోట వద్ద జరిగిన ఉద్రిక్త ఘటనల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, కార్యకర్త దీప్‌ సిద్ధూ ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదు

Updated : 29 Jan 2021 17:45 IST

చండీగఢ్‌: గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోట వద్ద జరిగిన ఉద్రిక్త ఘటనల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, కార్యకర్త దీప్‌ సిద్ధూ ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్న సిద్ధూ.. తాజాగా మరో వీడియో పోస్ట్‌ చేశారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే అందుకోసం తనకు కొంత సమయం కావాలని అడిగారు. 

‘నాపై అరెస్టు వారెంట్‌ ఉంది. లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. నేను విచారణకు హాజరవుతా. నాపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం. అలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవపట్టిస్తాయి. నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి. ఎందుకు పారిపోవాలి? అయితే నాపై వస్తున్న వదంతులు అవాస్తవమని నిరూపించేందుకు నాకు కొంత సమయం కావాలి. అందుకే రెండు రోజుల గడువు ఇస్తే నిజాలను బయటపెడతా. సాక్ష్యాధారాలతో విచారణలో పాల్గొంటా’ అని ఫేస్‌బుక్‌ వీడియోలో సిద్ధూ తెలిపారు.

జనవరి 26న దిల్లీలో ఉద్రిక్తకర పరిస్థితులకు దీప్‌ సిద్ధూనే కారణమని, రైతులు ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, ఎర్రకోటపై మతపరమైన జెండాతో పాటు రైతుల జెండా ఎగురవేసిన సమయంలో సిద్ధూ అక్కడే ఉన్నారు. జెండాలు ఎగరవేయడాన్ని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు కూడా చేశారు. 

అల్లర్లకు సిద్ధూనే బాధ్యుడని రైతు సంఘాలు కూడా ఆరోపించాయి. ఆయన దేశద్రోహి అని దుయ్యబట్టాయి. కాగా.. ఘటన తర్వాత నుంచి సిద్ధూ కన్పించకుండా పోవడం గమనార్హం. మరోవైపు ఎర్రకోట ఘటనపై దర్యాప్తు చేపట్టిన దిల్లీ పోలీసులు సిద్ధూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆయనపై లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తనను దేశద్రోహి అనడాన్ని ఖండిస్తూ సిద్ధూ నిన్న ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

ఇవీ చదవండి..

దిల్లీ-యూపీ సరిహద్దుల్లో ఉద్రిక్తత

రైతుల సంక్షేభం కోసమే కొత్త చట్టాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని