గుజరాత్‌లో అమానుషం.. జీతం అడిగాడని నోట్లో చెప్పు పెట్టి..!

జీతం అడిగాడన్న కోపంతో ఓ ఉద్యోగిపై సంస్థ నిర్వాహకురాలు భౌతిక దాడి చేశారు. అతడి నోట్లో చెప్పు పెట్టి క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు.

Published : 25 Nov 2023 01:44 IST

మోర్బి: తాను పని చేసిన 15 రోజులకు గాను జీతం అడిగాడన్న కారణంతో ఓ ఉద్యోగిపై సంస్థ నిర్వాహకురాలు భౌతిక దాడికి దిగారు. అతడి నోట్లో చెప్పుపెట్టి.. క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు. అంతేకాకుండా డబ్బు దోచుకోవడానికి వచ్చానని బలవంతంగా అతడితో చెప్పించి వీడియో తీశారు. గుజరాత్‌లోని (Gujarat) మోర్బిలో (Morbi) బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితురాలితో పాటు, ఆమెకు సహకరించిన మరో ఆరుగురిపై మోర్బి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజౌరీ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదులు నక్కింది ఇక్కడే!

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విభూతి పటేల్‌ అనే మహిళ ‘రాణిబా ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట టైల్స్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో నీలేశ్‌ దల్సానియా అనే 21 ఏళ్ల దళిత యువకుడ్ని మార్కెటింగ్‌ కోసం నియమించుకున్నారు. నెలకు రూ.12 వేల జీతం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఉన్నట్టుండి అక్టోబర్‌ 18న అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో వారాంతాలు పోనూ, తాను పని చేసిన 15 రోజుల జీతాన్ని ఇవ్వాల్సిందిగా అతడు నిర్వాహకురాలిని పలుమార్లు కోరాడు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఫలితం లేకపోవడంతో తన సోదరుడితోపాటు మరో వ్యక్తితో కలిసి సంస్థ కార్యాలయానికి వెళ్లాడు.

నేరుగా వెళ్లి అడిగేసరికి విభూతి పటేల్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన సోదరుడికి ఫోన్‌ చేసి రప్పించారు. వారంతా పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నీలేశ్‌ను టెర్రస్‌ మీదకి ఈడ్చుకుంటూ వెళ్లిన విభూతి పటేల్‌.. అతడిపై భౌతికదాడి చేశారు. నోట్లో చెప్పు పెట్టి.. క్షమాపణ అడగాలని కోరారు. ఈలోగా సంస్థలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు కూడా ఆమెకు వత్తాసు పలుకుతూ.. నీలేశ్‌ తరఫున వచ్చిన వారిపై దాడి చేసినట్లు డీఎస్పీ వివరించారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి, స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు దోచుకునేందుకు వచ్చానని బలవంతగా చెప్పిస్తూ వీడియో తీశారని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో దాడి వాస్తవమేనని తేలినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని