కొవిడ్‌ చికిత్స: జింక్‌, విటమిన్‌-సీ ప్రభావమెంత?

సాధారణ చికిత్సతో పోలిస్తే జింక్‌, విటమిన్‌-సీ మందులు వైరస్‌ తీవ్రతను తగ్గించడంలో ఆశించినంత ప్రభావం చూపడంలేదని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

Updated : 17 Feb 2021 05:31 IST

అమెరికన్ పరిశోధకులు ఏమన్నారంటే..!

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌ మహమ్మారి చికిత్స కోసం ఓ వైపు మరిన్ని ఔషధాలు అభివృద్ధికి ప్రయత్నం జరుగుతుండగా.. మరోవైపు ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సాధారణ చికిత్సతో పోలిస్తే జింక్‌, విటమిన్‌-సీ మందులు వైరస్‌ తీవ్రతను తగ్గించడంలో ఆశించినంత ప్రభావం చూపడంలేదని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికా పరిశోధకులు చేసిన తాజా అధ్యయనాన్ని జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(JAMA)లో విశ్లేషణకు ఉంచింది.

పరిశోధనలో భాగంగా 214మంది కొవిడ్‌ రోగులపై అమెరికాలోని క్లెవెలాండ్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా మొత్తం నాలుగు భాగాలుగా చికిత్స అందించారు. కొందరికి జింక్‌ గ్లుకొనేట్‌ (50ఎంజీ), ఇంకొందరికి విటమిన్‌-సీ (8000 ఎంజీ)లను పది రోజులపాటు అందించగా, మరికొందరికి రెండు మందులు కలిపి ఇచ్చారు. ఇక మిగిలిన వారికి సాధారణ చికిత్స అందించారు. అయితే, 50శాతం లక్షణాలు తగ్గిన ఈ నాలుగు గ్రూపుల వారి ఆరోగ్యాన్ని విశ్లేషించారు. తద్వారా మందులు తీసుకున్న వారిలో, మందులు తీసుకోకుండా సాధారణ చికిత్స తీసుకున్న వారిలో ప్రత్యేకించి ఎలాంటి మార్పు కనిపించలేదని పరిశోధనలకు నేతృత్వం వహించిన మిలింద్‌‌ దేశాయ్‌ స్పష్టంచేశారు. అయితే, వీటి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ చికిత్సపై మరిన్ని ప్రయోగాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా సోకిన వారు జింక్‌, విటమిన్‌-సీ మందులను ఎక్కువగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన జరిపినట్లు పరిశోధనలో పాల్గొన్న సుమా థామస్‌ వెల్లడించారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుండగా, మరోవైపు చికిత్స కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు కొవిడ్‌ చికిత్సకు కచ్చితమైన మందులు లేనప్పటికీ కొన్నిరకాల ఔషధాలు చికిత్సలో దోహదం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వీటిలో జింక్‌, విటమిన్-సీ ప్రయోజనకరంగా ఉంటున్నట్లు ఇప్పటివరకు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ తీవ్రతను తగ్గించడంలో లేదా లక్షణాలను నియంత్రించడంలో వీటి సామర్థ్యం తక్కువేనని క్లెవెలాండ్‌ పరిశోధకులు గుర్తించారు. అయితే, యాంటీబాడీలలో కీలకంగా వ్యవహరించే జింక్‌, తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడంతోపాటు వైరస్‌తో పోరాడే రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక కణాలకు జరిగే అపాయాన్ని విటమిన్‌-సీ తగ్గిస్తుందని వారు పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని