bell bottom: ఇందిరాగాంధీలా మిస్‌ యూనివర్స్‌ లారాదత్తా మారిందిలా..!

క్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘బెల్‌బాటమ్‌’ ట్రైలర్‌ విడుదలైన 21గంటల్లోనే 20మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది.  బాలీవుడ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ అండర్‌ కవర్‌ రా ఏజెంట్‌ ‘బెల్‌బాటమ్‌’గా కనిపించనున్నారు. ఇక ట్రైలర్‌ అంతా ఒకెత్తైతే.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన లారా దత్తా నటన మరో ఎత్తు.

Updated : 05 Aug 2021 18:01 IST

ముంబయి: అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘బెల్‌బాటమ్‌’ ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ అండర్‌ కవర్‌ రా ఏజెంట్‌ ‘బెల్‌బాటమ్‌’గా కనిపించనున్నారు. ఇక ట్రైలర్‌ అంతా ఒకెత్తైతే.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన లారా దత్తా నటన మరో ఎత్తు. అచ్చుగుద్దినట్టు ఇందిరా గాంధీ హెయిర్‌స్టైల్‌, చీరకట్టు, హావభావాలు పలకించారు 46ఏళ్ల నటి, మిస్‌ యూనివర్స్‌ లారా. ఇంత సహజంగా.. ఇందిరాగాంధీలా కనిపించేందుకు లారాదత్తాకు ప్రోస్థెటిక్‌ మేకప్‌ వేశారు. సవాలుతో కూడుకున్న ఇలాంటి పాత్ర పోషించడం ఆమెకు మొదటిసారి. ప్రస్తుతం నెట్టింట ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ‘‘లారా పాత్రలో చక్కగా నటించింది. మేము చూసేది లారానా లేక ఇందిరాగాంధీనా’’ అంటూ ట్విటర్‌లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ప్రోస్థెటిక్‌ మేకప్‌తో ఇందిరాగాంధీలా కనిపించేలా చేసిన మేకప్‌ ఆర్టిస్‌ కృషికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మేకప్‌ ఆర్టిస్ట్‌.. జాతీయ పురస్కారానికి అర్హుడంటూ కొనియాడుతున్నారు.

కేవలం లారా దత్తానే కాదు. బాలీవుడ్‌, కొలీవుడ్‌లో ఎందరో తారలు ప్రోస్థెటిక్‌ మేకప్‌లో నటించి మెప్పించించారు. ఈ మేకప్‌ వేసుకునేందుకు సుమారు  4గంటల పైనే సమయం పడుతుంది. ‘పా’ చిత్రంలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, ‘రాబ్తా’లో రాజ్‌కుమార్‌ రావ్‌, ‘భారతీయుడు’లో వృద్ధుడి గెటప్‌లో కమల్‌హాసన్‌, భామనే సత్యభామనేలో బామ్మగెటప్‌లో కమల్‌ హాసన్‌.. కపూర్‌ అండ్‌ సన్స్‌లో రిషి కపూర్‌, ఫ్యాన్‌ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌, ధూమ్‌2లో హృతిక్‌ రోషన్‌, ది నంబీ ఎఫెక్ట్‌లో ఆర్‌.మాధవన్‌, సంజూ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఛపాక్‌లో దీపిక పదుకొణె.. అలాంటి సవాలుతో కూడుకున్న పాత్రలు పోషించి మెప్పించిన వాళ్లే.


అమితాబ్‌ బచ్చన్‌

2009లో విడుదలైన ‘పా’ కామెడీ డ్రామా నేపథ్యంలో ఆర్‌.బల్కి దర్శకత్వంలో వచ్చింది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ ప్రొజిరియా అనే అరుదైన జన్యు సమస్యతో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ వ్యాధితో వయసు చిన్నదైన సరే, భారీ ఆకారంలో కనిపిస్తారు. అలా అమితాబ్‌ శరీరంలో మార్పు వచ్చేలా ప్రొస్థెటిక్‌ మేకప్‌ వేశారు. కాగా ఇందులో తనయుడు అభిషేక్‌ బచ్చన్‌కి కొడుక పాత్రలో నటించి మెప్పించాడు బిగ్‌బి. ఇందుగానూ మూడోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అంతే కాదు.. ఐదో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సైతం ఆయన్నే వరించింది.


కమల్‌ హాసన్‌ (భారతీయుడు, భామనే సత్యభామనే, దశావతారం) 

* అవినీతి, లంచగొండితనాన్ని ప్రశ్నిస్తూ శంకర్‌ సంధించిన బాణం ‘భారతీయుడు’. కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేశారు. 1996లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడిగా వృద్ధుడి పాత్రలో నటించి మెప్పించారు కమల్‌. అదే ఏడాదికి గానూ జాతీయ ఉత్తమ నటుడు, తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సౌత్‌, సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డు.. ఇలా నాలుగు అవార్డులను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు-2’ శంకర్‌ దర్శకత్వంలో రాబోతుంది. నెడుమూడి వేణు, కాజల్‌, రకుల్‌, సిద్ధార్థ్‌, బాబి సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

* కమల్‌హాసన్‌లో నట విశ్వరూపాన్ని తెరపై చూపించిన చిత్రం ‘దశావతారం’. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఉత్తమ నటుడు విభాగంలో తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ విలన్‌, ఉత్తమ కథ, స్క్రీన్‌ప్లే విభాగాలకు విజయ అవార్డ్ దక్కించుకున్నారు. అమెరికన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ మైకెల్‌ వెస్ట్‌మోర్‌, కోదండపాణి ఉత్తమ మేకప్‌ విభాగంలో తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అంతకుముందు ‘భామనే సత్యభామనే’లో కూడా కమల్‌ హాసన్‌ బామ్మ పాత్ర పోషించారు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. కాగా కె.ఎం శరత్‌ కుమార్‌ ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ విభాగానికి గానూ తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు. 


రిషి కపూర్‌ (కపూర్‌ అండ్‌ సన్స్‌) 

కపూర్‌ అండ్‌ సన్స్‌ చిత్రంలో 90 ఏళ్ల వృద్ధుడి పాత్రలో నటించారు రిషి కపూర్‌. 2016లో విడుదలైన ఈ చిత్రాన్ని శకున్ బాత్రా దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నటించిన రిషి కపూర్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్, స్టార్‌ స్ర్కీన్‌ అవార్డ్‌, ఉత్తమ హాస్యనటుడిగా జీ సినీ అవార్డ్స్‌ వరించాయి.


దీపికా పదుకొణె (ఛపాక్) 

యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీరాయ్‌ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించారు. 2020లో విడుదలైన ఈ చిత్రాన్ని మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దీపికా లుక్ తో పాటు అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. 


షారుఖ్ ఖాన్‌ (ఫ్యాన్‌) 

2016లో విడుదలైన ఫ్యాన్‌ చిత్రంలో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేశారు. నటుడు ఆర్యన్‌ ఖన్నా, అతడి ఫ్యాన్‌గా గౌరవ్‌ చంద్నా పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి దర్శకత్వం మనీష్‌ శర్మ వహించారు. ఉత్తమ మేకప్‌ విభాగానికి గానూ అమెరికన్‌ గ్రేగ్‌ కానామ్‌ ఇంటర్నేష్నల్‌ ఇండియాన్‌ ఫిల్మ్‌ అకాడెమీ అవార్డు అందుకున్నారు. షారుఖ్‌కు ఉత్తమ నటుడిగా స్టార్‌ డస్ట్‌ అవార్డు వరించింది


రణ్‌బీర్‌ కపూర్‌ (సంజూ)

నటుడు సంజయ్‌దత్‌ జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’లో రణ్‌బీర్‌ కపూర్‌.. సంజయ్‌ దత్‌ పాత్రను పోషించారు. 2018లో విడుదలైన ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించారు. యువకుడి నుంచి వృద్ధుడి పాత్రలో నటించి మెప్పించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు దక్కించుకుంది. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.590 కోట్ల వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, జైల్‌ సీన్‌లో రణ్‌బీర్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉత్తమ నటుడు విభానికి గానూ జీ సినీ అవార్డుతో పాటు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ దక్కించుకున్నారు.


మాధవన్‌ (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌)

ఇస్రో ఏరో స్పేస్‌ ఇంజినీర్‌, శాస్త్రవేత నంబి నారాయణ్‌ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌. ప్రస్తుతం పొస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రం ఇదే ఏడాది విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన మాధవన్‌.. ఈ చిత్రానికి తొలిసారి దర్శకత్వం, స్ర్కీన్‌ప్లే వహించడం విశేషం. హిందీ, ఇంగ్లిష్‌, తమిళ్‌, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రాబోతుంది. సిమ్రాన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌.


విక్రమ్‌ (కోబ్రా) 

విలక్షణ పాత్రలకే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు నటుడు విక్రమ్‌. గతంలో ఆయన నటించిన పలు చిత్రాలు, అందులోని పాత్రల కోసం ఎంత కష్టపడేవారు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘మల్లన్న’, ‘ఇంకొక్కడు’, చిత్రాల్లో విభిన్న గెటప్‌లో అలరించిన విక్రమ్‌ ఇప్పుడు మరోసారి అదేబాట పట్టారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’ ఇందులో ఏడు విభిన్న పాత్రల్లో ఆయన కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని