Tholi Prema: ఆ పాట చూడటానికి రాత్రి 2గంటల వరకూ బయట కూర్చొన్న పవన్‌

Tholi Prema: పవన్‌కల్యాణ్‌ నటించిన తొలిప్రేమ 25ఏళ్లు అవుతున్న సందర్భంగా కరుణాకరణ్‌ పంచుకున్న కొన్ని విశేషాలు..

Published : 30 Jun 2023 09:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan kalayn) కథానాయకుడిగా కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘తొలిప్రేమ’ (Tholi Prema). ఈ సినిమా విడుదలై 25ఏళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా 4కెలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు కరుణాకరన్‌ ‘తొలిప్రేమ’ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘ప్రేమదేశం’ సినిమా కోసం ఖదీర్‌ సర్‌ దగ్గర క్లాప్‌ అసిస్టెంట్‌కు జాయిన్‌ అయ్యా. ఏడాది తిరిగే సరికి కో-డైరెక్టర్‌గా ప్రమోట్‌ అయ్యా. ఆ తర్వాత కథను రెడీ చేసుకుని, ఎవరికి చెప్పాలా? అనుకున్నప్పుడు ఓ మేగజైన్‌లో పవన్‌ కల్యాణ్‌ ఫొటో కనిపించింది. అది చూడగానే ‘ఇతడే నా హీరో’ అనుకున్నా. చిరంజీవిగారి తమ్ముడని ఆ తర్వాత నాకు తెలిసింది. ‘తొలి ప్రేమ’ కథ రెడీ చేసుకున్న తర్వాత పవన్‌కల్యాణ్‌ను కలవడానికి ఏడు నెలలు వేచి చూడాల్సి వచ్చింది. ఎవరి ద్వారా ఆయన్ను కలవాలో తెలియలేదు. ఒక తెలుగు సినిమా చర్చల్లో భాగంగా ఇక్కడకు వస్తే, నా స్నేహితుడి ద్వారా గిరి పరిచయం అయ్యారు. ఆయన కల్యాణ్‌ బాబాయ్‌ సూర్యంను పరిచయం చేశారు. అలా కల్యాణ్‌ అన్నయ్యకు కథ చెప్పే అవకాశం లభించింది’’

‘‘ఆ రోజు 7గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. గ్రీన్‌పార్క్‌ హోటల్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మా కారు పంక్చర్‌ అయింది. దాన్ని బాగు చేసుకుని 8.30గంటలకు వెళ్లే సరికి కల్యాణ్‌ అన్నయ్య కోప్పడుతూ కనిపించారు. భయపడుతూనే వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకున్నా. అప్పుడు ఆయన చేతిలో గన్‌ కూడా ఉంది. దాన్ని టేబుల్‌పై పెట్టారు. ‘అన్నయ్యా.. మీకు కథ నచ్చకపోతే కాల్చేయరు కదా’ అన్నారు. ఒక్కసారిగా నవ్వేశారు. అప్పటివరకూ ఉన్న కోపం అంతా పోయింది. ‘తమిళ్‌లో కథ చెబుతానని అంటే ఆయన ఓకే అన్నారు. ప్రతి సీన్‌కు సంబంధించిన స్టోరీబోర్డ్‌ వేయడం నాకు అలవాటు. కథ చెబుతూనే అవన్నీ చూపించా. మొత్తం విని ‘ఇంతకాలం ఎక్కడున్నావు. కథ నచ్చింది. సినిమా చేస్తున్నాం’ అన్నారు. ఆ తర్వాత నిర్మాత జీవీజీ రాజును పరిచయం చేశారు. కథ చెప్పటం ఒకెత్తయితే, దాన్ని సినిమాగా తీయడం మరొక ఎత్తు.  షూటింగ్‌ ముందు రోజు రాత్రి నిద్ర రాలేదు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు ప్రతి విషయంలోనూ కల్యాణ్‌గారు నాకు సాయం చేస్తూనే వచ్చారు. నేను షాట్‌ ‘ఓకే’ అనే వరకూ ఎన్నిసార్లు చేయడానికైనా ఆలోచించే వారు కాదు. ఆయన సీన్లు లేకపోయినా సెట్‌లో ఉండి, సలహాలు ఇచ్చేవారు.’’

రాత్రి 2గంటల వరకూ వేచి చూశారు!

‘‘షూటింగ్‌ అంతా పూర్తయ్యాక ఎడిటింగ్‌ పనులు రామానాయుడు స్టూడియోలో చేస్తున్నాం. ఆ రోజు ‘ఈ మనస్సే..’ సాంగ్‌ను ఎడిట్‌ చేస్తున్నాం. మాంటేజ్‌లో వచ్చే ఆ సాంగ్‌ అంటే పవన్‌ అన్నయ్యకు ఎంతో ఇష్టం. రాత్రి 8గంటలకు స్టూడియోకు వచ్చి ‘కరుణ.. ఆ పాట ఒకసారి చూపిస్తావా’ అన్నారు. ‘అన్నయ్యా.. కొంచెం వెయిట్‌ చేయండి’ అన్నాను. దాన్ని మార్పులు, చేర్పులు చేసి, నేను అనుకున్న విధంగా సన్నివేశాలను ఎడిట్‌ చేసే సరికి రాత్రి 2గంటలు అయింది. బయటకు వచ్చి చూస్తే అన్నయ్య అక్కడే బల్లపై కూర్చొని కనిపించారు. ‘మీరు ఇంటికి వెళ్లలేదా’ అన్నాను. ‘పాట చూసి వెళ్దామని వెయిట్‌ చేస్తున్నా. చూద్దామా..’ అన్నారు. ఆ సాంగ్‌ చూసిన తర్వాత నన్ను గట్టి కౌగలించుకుని ‘చాలా బాగా చేశావ్‌’ అని మెచ్చుకున్నారు. ఇక సినిమా విడుదలైన రోజున నేను చెన్నైలో ఉన్నా. ఫోన్‌ చేసి ‘సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది’ అని అన్నారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. అయిదు రోజుల తర్వాత హైదరాబాద్‌ వచ్చి, ప్రేక్షకుల మధ్య సినిమా చూశా. అప్పుడు హైదరాబాద్‌లో దిల్‌రాజు అన్నీ చూసుకున్నారు’’

అవన్నీ నా నిజజీవితం నుంచి తీసుకున్నవే!

‘‘నా సినిమాల్లో అత్యధిక సీన్లు నా నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొందినవే. ‘తొలి ప్రేమ’లో హీరోయిన్‌ పరిచయ సన్నివేశం నిజ జీవితంలో నేను చూశా. దీపావళి పండగ రోజు చెన్నై నుంచి మా ఊరు వెళ్తుంటే, ఒక అమ్మాయి గొంతు వినిపించింది. అటు తిరిగి చూస్తే చిచ్చుబుడ్డి వెలుగులో ఒక్కసారిగా ఆ అమ్మాయి ముఖం కనిపించి ఆ తర్వాత అంతా చీకటైపోయింది. నా మైండ్‌పై అది బలమైన ముద్రవేసింది. ఇంటికి వెళ్లగానే పేపర్‌ ఆ సీన్‌ రాసుకున్నా. అదే ‘తొలి ప్రేమ’లో పెట్టా. ఆ సీన్‌కు ఛోటా కె నాయుడు లైటింగ్‌ ఎఫెక్ట్‌ ఇచ్చారు. హైస్కూల్‌ చదువుతున్న ఓ అమ్మాయి ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటేషన్‌కు ఏంజిల్‌లా రెడీ అయి, బండిపై వెళ్తుండగా నాకు కనిపించింది. అదే సీన్‌ ‘డార్లింగ్‌’లో కాజల్‌ కోసం పెట్టా’’ అని కరుణాకరన్‌ చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని