25 years of satya: ‘హిందీ సినిమా చరిత్రలో వరెస్ట్‌ ఫిల్మ్‌’ అన్నారు.. రెండు వారాలు జనాలే లేరు!

25 years of satya: ‘సత్య’ విడుదలై 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 03 Jul 2023 18:56 IST

‘‘ఎప్పుడూ తీసే దాన్ని మామూలు సినిమా అంటారు.. ఎప్పుడో తీసే దాన్ని కల్ట్‌ మూవీ’’ భారతీయ సినిమా ఇండస్ట్రీలో 25ఏళ్ల కిందట అలాంటి కల్ట్‌ మూవీ వచ్చింది. అదే ‘సత్య’ (25 years of satya). సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మనోజ్‌ బాజ్‌పాయ్‌, ఊర్మిళ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జులై 3, 1998న విడుదలైన ‘సత్య’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా మనోజ్‌ బాజ్‌పాయ్‌ జాతీయ అవార్డును అందుకున్నారు. ‘సత్య’ విడుదలై 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా గురించి వివిధ సందర్భాల్లో చిత్ర యూనిట్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. ఒక పక్క తెలుగులో సినిమాలు తీస్తూనే అడపదడపా హిందీలోనూ చేస్తున్న రోజులవి. అప్పటికే ఆయన ‘శివ’, ‘ద్రోహి’, ‘రాత్’, ‘రంగీలా’, ‘దావూద్‌’ వంటి చిత్రాలను హిందీలో తీశారు. ఈసారి అందరికీ కొత్తవారిని పెట్టుకుని ఓ గ్యాంగ్‌స్టర్‌ మూవీ (satya movie) తీయాలనుకున్నారు. అలా ఇద్దరు ‘సత్య’ మూవీకి బీజం పడింది.

సత్య పాత్ర మనోజ్‌ చేయాల్సింది!

తొలుత ఇందులో ‘సత్య’ పాత్ర కోసం మనోజ్‌ బాజ్‌పాయ్‌ను అనుకున్నారు. అయితే, స్క్రిప్ట్‌, పాత్రల పరంగా మరింత స్పష్టత వచ్చే సరికి, సత్య పాత్రకు అతడికంటే కాస్త మంచి నటుడు కావాలనిపించింది. దీంతో  జేడీ చక్రవర్తివైపు వర్మ మొగ్గు చూపారు. అందుకు కారణం కూడా ఉంది. జేడీ అప్పటికే దక్షిణాదిలో మంచి నటుడిగా రాణిస్తున్నారు. హిందీ వాళ్లకు కొత్త. పైగా అతడు మాట్లాడే హిందీ ఉత్తరాది వాళ్ల యాసలో ఉండదు. దీంతో మనోజ్‌ బాజ్‌పాయ్‌ను సెకండ్‌ లీడ్‌ బీకూ మాత్రే కోసం ఎంపిక చేశారు.

నిస్సహాయ స్థితిలో ఒప్పుకొన్నా: మనోజ్‌ బాజ్‌పాయ్‌

‘సత్య’ పాత్రకు తనని కాకుండా వేరేవాళ్లను తీసుకున్నారని తెలిసి మనోజ్‌ బాజ్‌పాయ్‌ చాలా బాధపడ్డారు. కానీ, ఆ తర్వాత ఆ పాత్రకు వచ్చిన ప్రశంసలు చూసి తనకి దక్కిన అదృష్టంగా భావించారు. ‘‘సత్య’ పాత్ర నేను కాకుండా వేరే వాళ్లు చేస్తున్నారని తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. నాకు సెకండ్‌ లీడ్‌ రోల్‌ ఇచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పుడు పరిస్థితి అది. నేను కూడా ఏమీ చేయలేకపోయా. బరువైన హృదయంతో బీకూ మాత్రే పాత్రను ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే, సినిమా విడుదలైన తర్వాత మాత్రేను అందరూ అక్కున చేర్చుకున్నారు. మాస్‌లో నాకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. రెండేళ్ల పాటు నేను ఎక్కడ కనపడినా ‘బీకూ మాత్రే’ అని పిలిచేవారు. కొందరు నేను నిజంగా మరాఠీ నటుడిని అనుకున్నారు. ఆ పాత్ర ఆహార్యాన్ని మా ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి నుంచి స్ఫూర్తిగా తీసుకున్నా. అతడి యాక్షన్‌, టెంపర్‌మెంట్‌ అలాగే ఉండేవి. వాటిని అలాగే తీసుకుని, నా యాసను మాత్రమే మార్చుకున్నా’’

నా నడుముకు తాడు కట్టారు

ఈ సినిమాలో ‘ముంబయికి రాజు ఎవరు.. కేవలం బీకూ మాత్రేనే’ అంటూ మనోజ్‌బాజ్‌పాయ్‌ సముద్ర ఒడ్డున ఉన్న బండ రాయిపై నిలబడి ముంబయి మహానగరాన్ని చూస్తూ డైలాగ్‌ చెప్పాలి. కానీ, మనోజ్‌కు ఎత్తైన ప్రదేశాలంటే భయం. ‘‘అనురాగ్‌ కశ్యప్‌, నేనూ కలిసి ఆ సీన్‌ డిజైన్‌ చేసుకున్నాం. కానీ, నాకు ఎత్తులంటే భయం. ‘ముంబయికి రాజు ఎవరు.. కేవలం బీకూ మాత్రేనే’ అనే డైలాగ్‌ సమయంలో నా నడుమును రోప్‌తో కట్టారు. నాకు వర్టిగో సమస్య ఉంది. అంత ఎత్తులో నిలబడి డైలాగ్‌ చెప్పటం నా వల్ల కాదని వర్మతో అన్నాను. అప్పుడు వర్మ... ‘నువ్వు కేవలం పెదాలు మాత్రమే కదుపు.. డబ్బింగ్‌లో మిగతాది మార్చుకుందాం’ అన్నారు. అప్పుడు నేను ‘దయ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. కాపాడండి. కాపాడండి.. అని అరిచా’’ డబ్బింగ్‌లో నాతో అసలు డైలాగ్‌లు చెప్పించారు’’

వర్మ ఎలా చెబితే అలా చేశా: జేడీ

‘‘సత్య పాత్ర పోషించడం అంత కష్టమేమీ కాదు. కానీ, ఒక్కటే సమస్య. గ్యాంగ్‌స్టర్‌లా ఆలోచించాలి. అనుకరించాలి. నా ముందున్న పెద్ద సవాల్‌ అదే. అందుకు ఎవరిని ఇమిటేట్‌ చేయాలా? అనుకున్నా. దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మించిన వ్యక్తి మరొకరు నాకు కనిపించలేదు. అతను చెప్పినట్లు నటించా. వర్మలో దర్శకుడు మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడు, అంతకుమించి అండర్‌వరల్డ్‌ డాన్‌ ఉన్నాడు’’

పాటలే ఉండకూడదన్న వర్మ.. మేం ఉండాల్సిందేనన్నాం: అనురాగ్‌ కశ్యప్‌

‘సత్య’లో ఒక్క పాట కూడా ఉండకూడదని వర్మ అనుకున్నారట. ఎందుకంటే తాను తీసేది గ్యాంగ్‌స్టర్‌ మూవీ ఆ కావడంతో ఆ డెప్త్‌ పోతుందని భావించారట. కానీ, చిత్ర బృందం అందుకు ఒప్పుకోలేదు. ‘‘సత్య’లో ఒక్క పాట కూడా ఉండకూడదని వర్మ తొలుత నిర్ణయించారు. కానీ, మేము అతడిని బ్రెయిన్‌ వాష్ చేశాం. అప్పట్లో మ్యూజిక్‌ కంపెనీలు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాయి. పాటలు లేకుండా సినిమాను ఎలా ప్రమోట్‌ చేస్తామని అడిగాం. దీంతో రెండు, మూడు పాటలుంటే చాలనుకున్నారు. ఆ తర్వాత ఐదారు పాటలు అయ్యాయి. ‘కల్లుమామ’ అయితే, ఇండస్ట్రీలో దుమ్మురేపింది. గేయ రచయిత గుల్జార్‌ ఈ పాట రాసినప్పుడు లిరిక్స్‌  ఎవరికీ నచ్చలేదు. కానీ, విశాల్‌ భరద్వాజ్‌ మొదట చెప్పిన డమ్మీ లైన్స్‌ బాగా నచ్చాయి. దీంతో గుల్జార్‌ను ఒప్పించే బాధ్యత నాకు (అనురాగ్‌) అప్పగించారు. ఆయన దగ్గరకు వెళ్లి ఈ విషయం చెబితే ‘మీ ఇష్టం. బయటకు పో’ అన్నారు. దాంతో ‘గోలిమార్‌ బేజే మే’ అంటూ పదాలను కొనసాగించాం. ఈ పాట తీసే సమయానికి సెట్‌కి సినిమాటోగ్రాఫర్‌ రాలేదు. దీంతో వర్మే స్వయంగా ఈ సాంగ్‌ షూట్‌ చేశారు. కేవలం నాలుగైదు షాట్స్‌ మాత్రమే డిజైన్‌ చేసుకున్నారు. నాలుగు గంటల్లో పాటను పూర్తి చేశారు. ఈ పాటకు మకరంద్‌ దేశ్‌పాండే డ్యాన్స్‌ మాస్టర్‌ అయితే, సెకండ్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ జేడీ చక్రవర్తి’’

హిందీ చరిత్రలో వరెస్ట్‌ మూవీ తీశారని అన్నారు: సౌరభ్ శుక్లా

‘‘కల్లు మామ’ పాట రామునే తీశారు. ఆ పాట తీసేటప్పుడు నిజంగానే బీర్‌ తాగాం. అందులో తడిసిపోయాం. ఫ్లోర్‌మొత్తం బీర్‌తో తడిసిపోయింది. ఈ సినిమా తర్వాత విశాల్‌ భరద్వాజ్‌ తన స్టూడియోను ‘సత్య స్టూడియో’గా మార్చేశాడు. సందౌప్‌ చౌతా నేపథ్య సంగీతం సినిమా మరొక హైలైట్‌.  ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్‌ చేసింది. వర్మ 50 రోజుల్లో ఈ సినిమా తీశారు. 60వేల అడుగుల ఫిల్మ్‌ వచ్చింది. ఆ వెంటనే ఓ 60మందిని పిలిచి షో వేశాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘అట్టరఫ్లాప్‌ మూవీ’ అన్నారు. ‘హిందీ సినిమా చరిత్రలో వరస్ట్‌  మూవీ’ అన్నారు. మాకు మాట రాలేదు. మేమంతా నిలబడి చూస్తూ ఉన్నాం. ‘ఇద్దరు చెడ్డ వ్యక్తుల గురించి సినిమా తీస్తే చూడాలా’ అన్నారు. ‘చివరలో వాళ్లిద్దరూ చనిపోతారు కదా’ అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. దీంతో ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేశాం. జులై 3, 1998న సినిమా విడుదలైంది. రెండు వారాల పాటు ఎక్కడా టాక్‌ వినిపించలేదు. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా సినిమా ప్రేక్షకులకు నచ్చేసింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు’’

మరికొన్ని విశేషాలు..

  • కథానాయికగా మహిమా చౌదరిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆ పాత్రలో ఊర్మిళ వచ్చి చేరారు.
  • సౌరభ్‌ శుక్లా పోషించిన కల్లు మామ పాత్రను బోరివాలి ప్రాంతంలో ఉన్న ఓ బారు యజమాని నుంచి స్ఫూర్తిగా తీసుకుని డిజైన్‌ చేశారు. అతడికి కూడా అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయి.
  • అనురాగ్‌ కశ్యప్‌, సౌరభ్ శుక్లా ఇందులో ‘సత్య’మూవీలోని పాత్రల పేర్ల కోసం చర్చిస్తుండగా, ఆఫీస్‌ బాయ్‌ ‘బీకూ’ టీ తీసుకుని అక్కడకు రావడంతో అతడి పేరే మనోజ్‌ బాజ్‌పాయ్‌కు పెట్టారు.
  • బీకూ మాత్రేగా మరాఠీ యాసలో మాట్లాడేందుకు మనోజ్‌బాజ్‌పాయ్‌ తన వంట మనిషి దగ్గర శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు, ఆ పాత్రకు సంబంధించిన దుస్తులన్నీ ఆయన స్వయంగా కొనుక్కొన్నారు. అందుకు చిత్ర నిర్మాణసంస్థ రూ.25వేలు ఇచ్చింది.
  • ‘సత్య’ మూవీని రూ.2కోట్లతో తీయాలనుకున్నారు. మరో 50లక్షలు అయింది. బాక్సాఫీస్‌ వద్ద  ఏకంగా రూ.15కోట్లు వసూలు చేసింది.
  • ఉత్తమ సహాయ నటుడిగా మనోజ్‌బాజ్‌ పాయ్‌ జాతీయ అవార్డును అందుకున్నారు
  • ఈ సినిమాకు మొత్తం 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వచ్చాయి. (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ సౌండ్‌ డిజైన్‌)
  • ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ దర్శకుడు  డానీ బోయల్‌ ఈ సినిమాను రిఫరెన్స్‌గా తీసుకుని, కొన్ని సీన్స్‌ తీశారు.
  • ‘సత్య ’ విడుదలైన తర్వాత ఇందులోని 23 సౌండ్‌ ట్రాక్‌లను ప్రత్యేక ఆల్బమ్‌గా విడుదల చేయడం గమనార్హం.
  • సినిమా రషెస్‌ చూసి, ‘వర్కవుట్‌కాదు. హింస ఎక్కువ ఉంది. చెమటకొట్టే ముఖాలను, మురికి ప్రాంతాలను, మాసిపోయిన బట్టలను ఎవరు చూస్తారు’ అన్నారు. గుల్జార్‌ కూమార్తె ఈ మూవీ చూసి, ‘కల్లుమామ పాట చూస్తుంటే థియేటర్‌లో బీరు వాసన వస్తోంది’ అన్నారట.
  • 1998 ఇండియన్‌ పనోరమ విభాగంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని