Sivaji: నా జోలికి రావొద్దు.. రాజకీయాలకు నేను సెట్‌ కాను: శివాజీ

శివాజీ - వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’. తాజాగా ఈ సిరీస్‌ సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.

Published : 20 Jan 2024 01:47 IST

హైదరాబాద్‌: పొలిటికల్‌ ఎంట్రీ గురించి నటుడు శివాజీ (Sivaji) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఎప్పుడూ భాగం కాలేదన్నారు. ‘‘ప్రత్యేక హోదా కోసమే గతంలో నేను పోరాటం చేశా. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజలు, నాయకులు కలిసి ఉంటున్నారు. అందుకు నేను సంతోషంగా ఉన్నా. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ పాల్గొనలేదు. వాటితో నాకు సంబంధం లేదు. యాక్టింగ్‌లోనే ఉంటా. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారికి గొంతుకగా ఉంటా. నన్ను కావాలని ఏదైనా పార్టీకి ఆపాదిస్తే.. కచ్చితంగా ఆ పార్టీలోనే చేరతా. అందరి పని చెబుతా. కాబట్టి నా జోలికి రావొద్దు. నిజాలు మాట్లాడతాను కాబట్టి అందరికీ సమస్యే. నాలాంటి వారు రాజకీయాలకు పనికి రారు’’ అని శివాజీ అన్నారు.

వెబ్‌సిరీస్‌లో చూపించినట్టుగానే ఇంట్లోనూ ఉంటారా? మార్కుల విషయంలో మీ పిల్లలతో అలాగే వ్యవహరిస్తారా?

శివాజీ: లేదు. జనరేషన్‌ మారింది. చిన్నతనంలో సరిగ్గా చదవకపోతే మా నాన్న కొట్టిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తల్లిదండ్రులెవరూ పిల్లలతో అలా వ్యవహరించడం లేదు. మా పిల్లలతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటా. ఈ ప్రాజెక్ట్‌ చేయడానికి ప్రధాన కారణం.. ఆదిత్య (సిరీస్‌లో శివాజీ చిన్న తనయుడు) పాత్ర. నా చిన్న కొడుకు కూడా అలాగే సరదాగా ఉంటాడు. బాగా చదువుతాడు. తల్లిదండ్రులు కోప్పడ్డారు, కొట్టారు.. అనే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన సమాజంలో తండ్రి పాత్రకు ఎంతో విలువ ఉంది. ఆయన ఏం చెప్పినా బాధ్యతతోనే చెబుతాడు. ఆయన అలా ఎందుకు మాట్లాడాడు అనేది నువ్వు తండ్రివి అయ్యాకే నీకు తెలుస్తుంది.

ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు మార్కులను కొలమానంగా చూస్తున్నారు. మీరు కూడా అలాగే చూస్తారా?

శివాజీ: చూడాలి. సమాజంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. దానివల్ల పిల్లలు సైడ్‌ ట్రాక్‌ పట్టే అవకాశం ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు తీసుకువెళ్లడానికి తల్లిదండ్రులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటారు. వారు ఎప్పటికీ పిల్లలకు శత్రువులు కాదు.

ఈ సిరీస్‌ విజయం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసిందా?

ఆదిత్య: వర్క్ విషయంలో ఎలాంటి టెన్షన్‌ లేదు. నా సంతృప్తి కోసమే సినిమాలు చేస్తున్నా. #90s సీక్వెల్‌ కూడా ఇలాగే మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఇంటర్‌, ఇంజినీరింగ్‌ గురించి సీక్వెల్‌లో చూపిస్తా. నా జీవితాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆదిత్య రోల్‌ క్రియేట్‌ చేశా. అందుకే నా పేరే పెట్టా.

కంటెంట్‌ వల్లే ఈ సిరీస్‌ సక్సెస్‌ అయ్యిందా?

శివాజీ: అవును. రోజువారీ జీవితంలో మనకు ఎన్నో టెన్షన్స్‌ ఉంటాయి. వాటి నుంచి రిలాక్స్‌ కావడానికి టీవీ ఒక మాధ్యమం. క్రైమ్‌ థ్రిల్లర్స్‌ కాకుండా వినోదం అందించే వాటిని చూడాలనుకుంటాం. క్రైమ్‌ థ్రిల్లర్స్‌ క్రియేట్‌ చేయడం సులభమే కానీ జీవితాన్ని స్క్రీన్‌పైకి తీసుకురావడం అద్భుతంగా ఉంటుంది. కంటెంట్‌ బాగుంటే ప్లాట్‌ఫామ్‌ కొత్తదా పాతదా అనేది చూడరు. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎన్ని తరాలైనా ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్‌కు వచ్చిన సక్సెస్‌ మరొకదానికి రాదు.

డెవిల్‌ చూశారా? త్వరలో మీ నుంచి ఏదైనా మూవీ వస్తుందా? 

నవీన్‌ మేడారం: డెవిల్‌ చూశా. కొన్ని మార్పులు చేశారు. ఆ సినిమా గురించి మాట్లాడటానికి ఇది సరైన సందర్భం కాదు. ‘స్పై’ నిర్మాతలు ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారితో ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేశా. వర్క్‌ కూడా మొదలైంది. 300 బీసీకి సంబంధించిన కథ. దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది.

భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? 

శివాజీ: ఒక నటుడిగా ఎన్నో రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చి నెల రోజులైంది. ఇప్పటివరకూ ఎనిమిది స్క్రిప్ట్‌లు విన్నా. రొటీన్‌గా ఉన్నాయి. కామెడీ స్క్రిప్ట్ ఓకే చేశా. విలన్‌గా కూడా చేస్తున్నా. ఈటీవీ విన్‌లో (ETV Win) రావడం వల్లే #90s సిరీస్‌కు ఈ స్థాయి గుర్తింపు వచ్చింది. ఈటీవీ అనేది ఒక ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌. అలాంటి బ్రాండ్‌లో వచ్చింది కాబట్టే దీనికి ఇంతటి గుర్తింపు. 15 రోజుల్లోనే 5 లక్షల సబ్‌స్క్రైబర్లు వచ్చారు. వేరే ఏదైనా కొత్త ప్లాట్‌ఫామ్‌ అయితే అది జరిగేదా?.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు