Pragathi: నటి ప్రగతి హోమ్‌ టూర్‌.. చూస్తే ఫిదా కావాల్సిందే

నటి ప్రగతి హోమ్ టూర్‌ నిర్వహించారు. ఈ వీడియోని తాజాగా ఆమె యూట్యూబ్‌ వేదికగా షేర్‌ చేశారు.

Published : 27 Oct 2022 01:56 IST

హైదరాబాద్‌: సినీ నటి ప్రగతి (Pragathi) హోమ్‌ నిర్వహించారు. నెటిజన్ల కోరిక మేరకు హోమ్ టూర్‌ వీడియో చేసిన ఆమె ‘PragStrong’ యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా షేర్‌ చేశారు. సుమారు 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తన ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకున్నారు. తన స్థోమతకు తగినట్లుగా తక్కువ ఖర్చులోనే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె చెప్పారు. ఇంట్లోని ప్రతి వస్తువూ ఒక జ్ఞాపకం అంటూ ఆమె ఈ టూర్‌ మొదలుపెట్టారు.

‘‘ప్రతి రూపాయిని కూడబెట్టుకుని.. ఎంతో ఇష్టపడి ప్రతి వస్తువును కొనుగోలు చేసి ఈ ఇంటిని ఇలా మార్చుకున్నాను. ఈ ఇంట్లోని ప్రతి వస్తువుకూ ఓ కథ ఉంది. ప్రపంచంలోనే నాకెంతో ఇష్టమైన ప్రదేశం ఈ ఇల్లు. ఇక్కడ ఉంటే పాజిటివ్‌, సంతోషంగా ఉంటా. అందుకు అనుగుణంగానే ఈ ఇంటిని సిద్ధం చేసుకున్నా. సినీ నటి ఇల్లు అనేసరికి కోట్లు ఖరీదైన ఇల్లు అనుకోవద్దు. ఒక మధ్య తరగతి కుటుంబం ఖర్చు పెట్టేలా, సాధారణమైన ఇల్లు ఇది. తక్కువ ఖర్చులోనే దీన్ని కొనుగోలు చేశా. పాతికేళ్ల నుంచి దాచి పెట్టుకున్న ప్రతి వస్తువులతో ఈ ఇంటిని అందంగా తీర్చిదిద్దా’’ అంటూ ప్రగతి తన డ్రీమ్‌ హౌస్‌ గురించి వివరించారు.

నేమ్‌ ప్లేట్‌ని చూపిస్తూ.. ‘‘దీనికి ఒక కథ ఉంది. జీవితంలో ఎప్పటికైనా ఓ ఇల్లు కొని.. దానికి ఈ నేమ్‌ ప్లేట్‌ పెట్టుకోవాలని భావించి సమారు 16 ఏళ్ల క్రితం దీనిని కొన్నాను. అలా అనుకున్న 10 ఏళ్ల తర్వాత ఈ ఇల్లు కొనుగోలు చేశా. కాబట్టి ఇది నాకెంతో స్పెషల్‌’’

‘‘ప్రధాన ద్వారానికి కూడా ఒక కథ ఉంది. ఓసారి నా కొడుకు ఇంటి తాళం ఎక్కడో మర్చిపోయాడు. చేసేది లేక డోర్‌ని పగలగొట్టాం. ఆ ప్లేస్‌ వరకూ చెక్క పెట్టించి పెయింట్‌ వేసి మళ్లీ సాధారణ తలుపుగా చేయవచ్చు. కాకపోతే, మా వాడు చేసిన తప్పు ఎప్పటికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఈవిధంగా ఆ ప్లేస్‌ వరకూ స్పెషల్‌ పెయింట్‌ వేయించా’’

ఉచిత సలహాలు ఇచ్చేవారికి తాను ఇచ్చే బదులిదేనంటూ ఆమె ఈ సందేశాన్ని చూపించారు

‘‘ఒక రోజులో 80శాతం నేను లివింగ్‌ ఏరియాలోనే గడుపుతుంటా. సినిమాలు, సిరీస్‌లు చూస్తుంటా. మా అమ్మ లీలమ్మ కూడా నాతోపాటే సోఫాలో కూర్చొని టీవీ చూసేవారు. ఇటీవల ఆమె కన్నుమూసింది. ఆమె ఎప్పుడూ నా పక్కనే ఉందనే భావన కోసం సోఫా పక్కనే ఆమె ఫొటో పెట్టాను’’

‘‘ఈ జ్ఞాపకానికి 22 ఏళ్లు. ప్రింటింగ్‌ ప్రెస్‌లో అచ్చులు పెట్టే బాక్స్‌ ఇది. ఓసారి ఈ బాక్స్‌ బయట దొరికితే ఇంటికి తీసుకువచ్చుకున్నా. దాన్ని ఇలా డిజైన్‌ చేయించుకున్నా. మా ఇంట్లో ఎక్కువగా పాతతరం వస్తువులు ఉంటాయి. సంగీతానికి సంబంధించిన బొమ్మలు, బుద్ధుడు ప్రతిమలు ఎక్కువగా కనిపిస్తాయి. సూర్యుడు అంటే కూడా నాకెంతో ఇష్టం. నా చేతిపై కూడా ఆయన టాటూనే ఉంటుంది’’ అని ప్రగతి వివరించారు. పరిశుభ్రత ఎక్కువగా పాటిస్తుంటానని ఆమె తెలిపారు. తనకు ఫొటోలంటే అంతగా ఇష్టం ఉండదని పేర్కొన్న ఆమె.. తాను ఫస్ట్‌ టైమ్‌ మేకప్‌ వేసుకున్న ఫొటోని మాత్రమే ఇంట్లో పెట్టుకున్నానని తెలిపారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు