Akhil: నా జీవితాన్ని మార్చింది ‘ఏజెంట్‌’

‘‘రోజూ జిమ్‌కి వెళ్లి కష్టపడితే శారీరకంగా ఎవరైనా మారతారు. కానీ ఈ సినిమాతో నేను మానసికంగా కూడా బలవంతుడినయ్యా. నా పరిధిని దాటి కష్టపడేలా చేసి... నా జీవితాన్నే మార్చింది’’ అన్నారు అఖిల్‌ (Akhil).

Updated : 16 Apr 2023 07:03 IST

అఖిల్‌ అక్కినేని

‘‘రోజూ జిమ్‌కి వెళ్లి కష్టపడితే శారీరకంగా ఎవరైనా మారతారు. కానీ ఈ సినిమాతో నేను మానసికంగా కూడా బలవంతుడినయ్యా. నా పరిధిని దాటి కష్టపడేలా చేసి... నా జీవితాన్నే మార్చింది’’ అన్నారు అఖిల్‌ (Akhil). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి ముఖ్యభూమిక పోషించారు. సురేందర్‌ 2 సినిమాతో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై  రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం రాత్రి హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ‘‘రెండేళ్ల ప్రయాణం ఈ చిత్రం. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎక్కువ కష్టపడ్డానని చెప్పను కానీ... సినిమా ప్రారంభానికి ముందే దర్శకుడు ఈ సినిమా ప్రయాణంలో ‘నేను ఇబ్బంది పెడతాను, పడాలి’ అని చెప్పారు. అఖిల్‌ చాలా మారిపోయాడు, కొత్తగా కనిపిస్తున్నాడనే మాటలు ఇప్పుడు వింటున్నాం అంటే ఆయనే కారణం. ఈ సినిమాకోసం ఎంతైనా కష్టపడతానని ఆ రోజే ఆయనకి మాట ఇచ్చి సెట్లోకి వెళ్లా. నేనైతే ఈ లుక్‌ని ఊహించుకోలేదు. ఆయన నన్ను ఇలా ఊహించుకుని ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ ప్రయాణం తర్వాత అలసిపోయా. కానీ ఈ అలసటలో ఓ తృప్తి ఉంది. మమ్ముట్టి పక్కన నటిస్తూ ఎంతో స్ఫూర్తిని పొందా’’ అన్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి (Surender Reddy) మాట్లాడుతూ  ‘‘భారతీయ భావోద్వేగాలతో కూడిన స్పై సినిమా ఇది. అఖిల్‌ ఇప్పటిదాకా చేసింది ఒకెత్తు, ఈ సినిమా తర్వాత ఆయన ప్రయాణం మరో ఎత్తు. ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడి అఖిల్‌ అక్కినేని. రెండేళ్లు అదే లుక్‌తో కొనసాగడం ఆషామాషీ కాదు. కానీ ఆయన ఏ మాత్రం ఆ ప్రభావం కనిపించకుండా ప్రయాణం చేశారు. అఖిల్‌, మమ్ముట్టి, అనిల్‌ సుంకర లేకపోతే ఈ సినిమా లేదు. సాక్షి వైద్య కొత్త కథానాయిక అయినా చాలా బాగా చేశారు. రసూల్‌ ఎల్లోర్‌తో ఇది నా మూడో సినిమా. విభిన్నమైన టోన్‌తో సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్‌ సుంకర మాట్లాడుతూ ‘‘మేమంతా ఇష్టపడి చేసిన సినిమా ఇది. వంద శాతం అంచనాల్ని అందుకుంటుంది.  ఒక స్టార్‌ని సిద్ధం చేస్తున్నామనే ఆలోచనతోనే మేమంతా కష్టపడ్డాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. గొప్ప ప్రయాణం. చాలా నేర్చుకున్నా. సహనటుడిగా అఖిల్‌ చక్కటి సహకారం అందించార’’న్నారు సాక్షి వైద్య. ఈ కార్యక్రమంలో నటుడు డినో మోరియా, ఛాయాగ్రాహకుడు రసూల్‌ ఎల్లోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని