Adipurush: ‘ఆదిపురుష్‌’.. సెన్సార్‌ బోర్డును తప్పుపట్టిన అలహాబాద్‌ హైకోర్టు

‘ఆదిపురుష్‌’లోని కొన్ని (Adipurush) డైలాగులపై అలహాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సెన్సార్‌ బోర్డును తప్పుపట్టింది. 

Updated : 27 Jun 2023 21:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్‌’ (Adipurush) మిశ్రమస్పందనలకే పరిమితమైన విషయం తెలిసిందే. అలాగే విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ కొన్ని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

‘ఆదిపురుష్‌’లో కొన్ని డైలాగులను తొలగించాలని కోరుతూ అలహాబాద్‌ హై కోర్టులో (Allahabad High Court) దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సంభాషణల విషయంలో హై కోర్టు సెన్సార్‌ బోర్డును తప్పు పట్టింది. సెన్సార్‌కు పంపిన సమయంలో ఇలాంటి సంభాషణలను ఎలా సమర్థించారంటూ ప్రశ్నించింది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తు తరాలకు ఏం నేర్పాలనుకున్నారంటూ మండిపడింది. విచారణకు సినిమా దర్శక నిర్మాతలు హాజరు కాకపోవడంపై హై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఓంరౌత్‌ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’లోని కొన్ని డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన చిత్రబృందం ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ కొన్ని సంభాషణల్లో మార్పులు చేసింది. ఇంకా ఈ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆదిపురుష్‌’ను బ్యాన్‌ చేయాలంటూ ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (All India Cine Workers Association) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Modi) ఇటీవల లేఖ రాసింది. అలాగే ఈ సినిమా చూసిన కొందరు సినీ ప్రముఖులు కూడా దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని