Allu Arjun: కేరళ విద్యార్థినికి అల్లు అర్జున్‌ సాయం.. కలెక్టర్‌ పోస్ట్‌తో వివరాలు బయటకు!

‘వీ ఆర్‌ అలెప్పీ’ ప్రాజెక్టులో అల్లు అర్జున్‌ భాగమయ్యారు. ఈ మేరకు ఆయన ఓ విద్యార్థినికి ఆర్థిక భరోసా ఇచ్చారు.

Updated : 11 Nov 2022 17:50 IST

అలెప్పీ: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) తన మంచి మనసు చాటుకున్నారు. కేరళలోని అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి ఆర్థిక భరోసా ఇచ్చారు. తండ్రిని పోగొట్టుకుని, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆ మెరిట్‌ స్టూడెంట్‌ పైచదువుకు అయ్యే ఖర్చంతా అల్లు అర్జునే భరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పటి వరకు గోప్యంగా ఉన్నాయి. అలెప్పీ కలెక్టర్‌ కృష్ణతేజ పోస్ట్‌తో ఇప్పుడు బయటకు వచ్చాయి. విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనిపించాల్సిన అవసరం లేదు’ అని అల్లు అర్జున్‌ ఓ సినిమాలో చెప్పిన సంభాషణను గుర్తు చేసుకుంటున్నారు.

కృష్ణతేజ పోస్ట్‌లో ఉన్న వివరాలివీ.. ‘‘కొన్ని రోజుల క్రితం నన్ను ఓ విద్యార్థిని కలిసింది. కొవిడ్‌తో ఆమె తండ్రి గతేడాది మరణించారు. ఇంటర్‌లో 92 శాతం ఉత్తీర్ణత సాధించినా పైచదువులకు వెళ్లలేని పరిస్థితి ఆమెది. ఆ స్టూడెంట్‌కు భవిష్యత్తుపై ఉన్న ఆశ, ఆత్మవిశ్వాసం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించాయి. నర్సింగ్‌ చేయాలనేది ఆమె కల. ‘వి ఆర్‌ ఫర్‌ అలెప్పీ’ ప్రాజెక్టులో భాగంగా ఆమెకు సాయం చేయాలనుకున్నాం. మెరిట్‌ కోటాలో దరఖాస్తు చేసుకునే సమయం ముగిసింది. మేనేజ్‌మెంట్‌ కోటా కోసం ప్రయత్నించగా కట్టనమ్‌లోని సెయింట్‌ థామస్‌ నర్సింగ్‌ కాలేజీలో సీటు లభించింది. దానికి ఓ స్పాన్సర్‌ కావాల్సివచ్చింది. మన ఫేవరెట్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఈ విషయాన్ని చెప్పా. ఆయన స్పందించారు. విద్యార్థిని హాస్టల్‌ ఫీజుతోసహా అన్నింటినీ ఆయన భరిస్తానన్నారు. ఆ స్టూడెంట్‌ జాయిన్‌ అయిన మరుసటి రోజు నేను ఆ కాలేజీకి వెళ్లా. ఆమె బాగా చదివి, ప్రయోజకురాలై సమాజానికి సేవ చేస్తుందనే నమ్మకం నాకుంది’’ అని పేర్కొన్నారు. విద్యార్థిని బంగారు భవిష్యత్తు కోసం ముందుకొచ్చిన అల్లు అర్జున్‌, థామస్‌ కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని