Bawaal Review: రివ్యూ: బవాల్‌.. జాన్వీ, వరుణ్‌ల ప్రేమకు, ప్రపంచ యుద్ధానికి లింకేంటి?

వరుణ్‌ ధావన్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కించిన చిత్రం ‘బవాల్‌’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Published : 21 Jul 2023 17:19 IST

Bawaal Review చిత్రం: బవాల్‌; నటీనటులు: వరుణ్‌ ధావన్‌, జాన్వీ కపూర్‌, మనోజ్‌, అంజుమాన్‌ సక్సేనా, ముకేశ్‌ తివారీ, ప్రతీక్‌ పచోరి, వ్యాస్‌ హేమంగ్‌ తదితరులు; మ్యూజిక్: డానియెల్‌ బి. జార్జ్ (నేపథ్య సంగీతం), మిథున్‌, తనిష్క్‌ బగ్చీ (పాటలు); ఎడిటింగ్‌: చారు శ్రీ రాయ్‌; సినిమాటోగ్రఫీ: మితేశ్‌; నిర్మాతలు: సాజిద్‌ నజియాద్‌వాలా, ఐశ్వర్య అయ్యర్‌ తివారీ; కథ: అశ్వినీ అయ్యార్‌ తివారీ; రచన: నితేశ్‌ తివారీ, పియూష్‌ గుప్త, నిఖిల్‌, శ్రేయస్‌ జైన్‌; దర్శకత్వం: నితేశ్‌ తివారీ; విడుదల: 21-07-2023 (ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో).

వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా నటించిన చిత్రం ‘బవాల్‌’ (Bawaal). నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. అందులోని పలు విజువల్స్‌.. ఈ రొమాంటిక్‌ డ్రామాకి రెండో ప్రపంచ యుద్ధంతో ఉన్న సంబంధమేంటనే ప్రశ్నను లేవనెత్తాయి. ఆ సందేహానికి సమాధానమిచ్చేందుకు ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో శుక్రవారం విడుదలైంది. మరి, ఆ రెండింటి మధ్య ఉన్న లింకేంటి? తెలుసుకోవాలనుకుంటే ఈ రివ్యూని చదివేయండి (Bawaal Review)..

కథేంటంటే: అజయ్‌ అలియాస్‌ అజ్జూ (వరుణ్‌ ధావన్‌).. హిస్టరీ టీచర్‌. కంటెంట్‌ లేకపోయినా కటౌట్‌ బాగుండాలనే మనస్తత్వం అతడిది. ఇమేజ్‌ కోసం తాపత్రయపడే అతడు నిషా (జాన్వీ కపూర్‌)ని వివాహం చేసుకుంటాడు. కానీ, పెళ్లికి ముందు ఓ విషయంలో అబద్ధం చెప్పిందనే కారణంతో ఆమెను దూరం పెడతాడు. ఓ రోజు ఇంట్లో వాగ్వాదం జరగ్గా ఆ కోపాన్ని విద్యార్థిపై ప్రదర్శిస్తాడు. స్టూడెంట్‌పై చేయి చేసుకోవడం చట్టరీత్యా నేరమంటూ స్టూడెంట్‌ తండ్రి, ఎమ్మెల్యే.. అజయ్‌ని సస్పెండ్‌ చేయాలంటూ ప్రిన్సిపాల్‌ని ఆదేశిస్తాడు. తనపై ఎలాంటి నెగెటివ్‌ మార్క్‌ పడకుండా ఉండేందుకు అజయ్‌ ప్రణాళిక రచిస్తాడు. రెండో ప్రపంచయుద్ధం జరిగిన ప్రాంతాలను విద్యార్థులకు చూపిస్తూ, ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు చెప్పాలనుకుంటున్నానని, ఉద్యోగం నుంచి తీసేయకుండా తనకు మరొక అవకాశం ఇవ్వమని కోరతాడు. అలా విదేశాలకు వెళ్లిన అజయ్‌ ఏం చేశాడు?ఇష్టంలేని భార్యని వెంట తీసుకెళ్లడానికి కారణమేంటి? అసలు నిషా దాచిన ఆ నిజమేంటి? విదేశాల్లో వీరిద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అజయ్‌ సర్‌ సస్పెండ్‌ అయ్యారా, లేదా? అన్నది మిగతా కథ (Bawaal Review).

ఎలా ఉందంటే: లఖ్‌నవూ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఆలుమగల మధ్య కలహాలను చూపిస్తూనే రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను గుర్తు చేస్తుంది. ప్రతి ప్రేమకథలో యుద్ధం దాగుంటుందనే అంశాన్ని ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు. ఉన్నదానితో సంతృప్తిపడక అంతకుమించి ఆశిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించారు. దానికి సెకండ్‌ వరల్డ్‌ వార్‌ కాన్సెప్ట్‌ని ముడిపెట్టడం కొత్త అనుభూతి పంచుతుంది. హీరో వ్యక్తిత్వాన్ని, యుద్ధ నేపథ్యాన్ని వాయిస్‌ ఓవర్‌లో తెలియజేయడం బాగుంది. తండ్రీకొడుకుల మధ్య చోటుకునే చిన్న చిన్న గొడవలు నవ్వులు పంచుతాయి. ఆయా సీన్లు చాలామందికి కనెక్ట్‌ అవుతాయి. హీరో మధ్యతరగతి కుటుంబ నేపథ్యం, వివాహం, కోపంలో స్టూడెంట్‌ని కొట్టడం, విదేశాలకు పయనమవ్వడంవంటి ఎపిసోడ్లతో ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. విరామ సమయంలో వచ్చే మలుపు కథని మరింత ఆసక్తిగా మారుస్తుంది. ఆ టూర్‌లోనైనా హీరోహీరోయిన్లు దగ్గరవుతారా? అనే ఉత్సుకత ప్రేక్షకుడికి కలుగుతుంది (Bawaal Review).

సెకండాఫ్‌లో నిషా క్యారెక్టర్‌, రెండో ప్రపంచ యుద్ధ సన్నివేశాలను హైలైట్‌ చేశారు. విమాన ప్రయాణం సన్నివేశాల్లో కొత్త పాత్రలు పరిచయమై, కడుపుబ్బా నవ్విస్తాయి. హీరో బ్యాగ్‌ మారిపోవడం, ఫోన్‌ పోగొట్టుకోవడం.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో భర్తకు తోడుగా నిలిచే నిషా పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఒకరి ఇష్టాయిష్టాల గురించి ఒకరు తెలుసుకునే సీన్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్షే! వార్‌ బ్యాక్‌డ్రాప్‌ ఎపిసోడ్లను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆయా సీక్వెన్స్‌ల్లో హీరోహీరోయిన్లు ఉన్నట్టు చూపించిన విధానం బాగుంది. ఆశకు పోతే హిట్లర్‌ జీవితం ఏమైందన్న పాయింట్‌నే ప్రధానంగా చూపించారు. ‘ఇకపై అజ్జూ సర్‌ భార్యపై కోప్పడరు.. ప్రేమగా చూసుకుంటాడు’ అని ఆడియన్స్‌ అనుకునేలోపు ట్విస్ట్‌ ఎదురవుతుంది. పతాక సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటుంది (Bawaal Review).

ఎవరెలా చేశారంటే: సమాజంలో గుర్తింపు కోసం ఏదైనా చేసే అజ్జూ సర్‌ పాత్రలో వరుణ్‌ ధావన్‌ అలవోకగా నటించాడు. మధ్యతరగతి ఇల్లాలిగా జాన్వీ కపూర్‌ ఒదిగిపోయింది. హీరోహీరోయిన్ల తల్లిదండ్రుల పాత్రలు ఆదర్శంగా నిలుస్తాయి. పాటలు అంతగా ప్రభావం చూపవు. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోదు. పారిస్‌, బెర్లిన్‌ తదితర ప్రాంతాలను మితేశ్‌ చక్కగా చూపించారు. నేటివిటికి తగ్గట్టు సంభాషణలు బాగున్నా.. హీరోహీరోయిన్ల డబ్బింగ్‌ మైనస్‌ అనిపిస్తుంది. ‘దంగల్‌’, ‘ఛిఛోరే’వంటి హిట్‌ సినిమాలను అందించిన నితేశ్‌ తివారీ ‘బవాల్‌’ విషయంలోనూ మంచి మార్కులే కొట్టేశారు (Bawaal Review).

  • బ‌లాలు
  • + కథ
  • + వరుణ్‌, జాన్వీల నటన
  • + ప్రథమార్ధం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్థంలో కొంత ల్యాగ్‌
  • - డబ్బింగ్‌ వాయిస్‌
  • చివరిగా: అజ్జూ సర్‌ పాఠం.. నవ్విస్తూ ఆలోచింపజేస్తుంది (Bawaal Review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని