Ninne Pelladata: నాగార్జునతో యాక్షన్‌ సినిమా తీయాలనుకొని..

నాగార్జున కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నిన్నేపెళ్లాడతా’ (Ninne Pelladata).

Published : 28 Jun 2023 09:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగార్జున కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నిన్నేపెళ్లాడతా’ (Ninne Pelladata). తెలుగులో వచ్చిన కుటుంబ కథా చిత్రాల్లో ఇది ఎవర్‌గ్రీన్‌. నాగార్జున, టబుల నటన, ఫ్యామిలీ సీన్స్‌ ఒకఎత్తైతే.. సందీప్‌ చౌతా పాటలను ఎవరూ మర్చిపోలేరు. అన్ని పాటలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌. నాగార్జునతో ‘నిన్నేపెళ్లాడతా’ వంటి కూల్‌ టైటిల్‌ పెట్టి సినిమా తీయడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాంగోపాల్‌వర్మ శిష్యుల్లో ఒకరైన  కృష్ణవంశీ తీసిన ‘గులాబీ’ చూసి తనతో సినిమా చేయమని ఆఫర్‌ ఇచ్చారు నాగార్జున. దీంతో ఒక మాస్‌, యాక్షన్‌ స్టోరీని సిద్ధం చేసుకుని ఆయనకు వినిపించారు. కథ విన్న నాగార్జున సినిమా చేయడానికి ఓకే చెప్పారు. దీంతో లొకేషన్స్‌ చూడటానికి విశాఖపట్నం వెళ్లిన కృష్ణవంశీని ఓ వ్యక్తి చూసి, గుర్తు పట్టి పలకరించారు. ‘మీ గురువు రాం గోపాల్ వర్మలా బాగా తీశారు’ అని ఆ వ్యక్తి ప్రశంసించాడు. దీంతో కృష్ణవంశీకి విషయం అర్థమైంది. తన మీద వర్మ వద్ద ముద్ర ఉండకూడదని నిర్ణయించుకున్న ఆయన నాగార్జునకు ఫోన్ చేసి ‘ఇంతకు ముందు మీకు చెప్పిన కథతో నేను సినిమా చేయడం లేదు’ అని చెప్పారు. ‘నీకు పిచ్చి పట్టలేదు కదా' అని నాగార్జున అడిగారట. ‘అదేమీ లేదండీ. రేపు మిమ్మల్ని వచ్చి కలుస్తాం’ అని చెప్పి ఫోన్ పెట్టేశారు కృష్ణవంశీ.

ఆ మరుసటి రోజు నాగార్జునని కలసి ‘నిన్నే పెళ్లాడతా’ కథ వినిపించారు. అప్పటికే హిందీలో ‘దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి ఫ్యామిలీ డ్రామాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ స్ఫూర్తితో ‘నిన్నే పెళ్లాడతా' కథ తయారు చేశారు కృష్ణవంశీ. తెలుగు నేటివిటీ దగ్గరగా, స్వచ్ఛమైన అనుబంధాలు, ఆప్యాయతల కలబోతగా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఉన్న ఏడు పాటల్లో మూడే మూడు డ్యూయట్‌లు కాగా, మిగిలిన నాలుగు పాటలూ సినిమాలోని అన్ని పాత్రల మీద చిత్రీకరించడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని