Bhakshak Review: రివ్యూ: భక్షక్‌.. భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన మూవీ మెప్పించిందా?

bhakshak review: భూమి పెడ్నేకర్‌ జర్నలిస్ట్‌గా నటించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Published : 10 Feb 2024 15:48 IST

Bhakshak Review; చిత్రం: భక్షక్‌; నటీనటులు: భూమి పెడ్నేకర్‌, సంజయ్‌ మిశ్రా, సాయి తమంకర్‌, ఆదిత్య శ్రీవాత్సవ తదితరులు; సంగీతం: అనురాగ్‌ శుక్లా, క్లింటన్‌ సెరోజో; సినిమాటోగ్రఫీ: కుమార్‌ సౌరభ్‌; ఎడిటింగ్‌: జుబిన్‌ షేక్‌; నిర్మాత: గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ; రచన: జోత్స్న నాథ్‌; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పుల్‌కిత్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని, తనని తాను నిరూపించుకుంటూ ముందుకుసాగుతున్న నటి భూమి పెడ్నేకర్‌. పుల్‌కిత్‌ దర్శకత్వంలో ఆమె నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ కమ్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌ ‘భక్షక్‌’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? (bhakshak review in telugu) విలేకరిగా భూమి పెడ్నేకర్‌ మెప్పించిందా?

కథేంటంటే: పట్నాలోని మునావర్‌పూర్‌లో ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటుంది వైశాలి (భూమి పెడ్నేకర్‌). యూట్యూబ్‌లో సొంతంగా న్యూస్‌ ఛానల్ పెట్టుకొని స్థానిక సంఘటనలపై వార్తలను అందిస్తుంటుంది. భాస్కర్ (సంజయ్ మిశ్రా) కెమెరామెన్‌గా వ్యవహరిస్తూ వార్తల సేకరణలో ఆమెకు సహాయం చేస్తుంటాడు. మునావర్‌పూర్‌లోని అనాథ బాలికల వసతిగృహంలో పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని స్థానికులు నివేదిక ఇచ్చినా నాయకులు, అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకు కారణం ఆ వసతిగృహాన్ని బన్సీలాల్ (ఆదిత్య శ్రీవాత్సవ) నిర్వహిస్తుండటమే. స్థానిక రాజకీయ నాయకులతో అతనికి ఉన్న సంబంధాల కారణంగానే అధికారులు, పోలీసులు కూడా అటువైపు చూడరు. ఈక్రమంలో ఆ వసతిగృహంలో జరిగే దారుణాల గురించి తెలుసుకున్న వైశాలి ఏం చేసింది? ఎలాంటి అండదండలు లేకపోయినా ఒంటరిగా ఎలా పోరాడింది? చివరకు బన్సీలాల్‌కు శిక్షపడేలా చేసిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:  సామాజిక సమస్యలే ఇతివృత్తంగా వెండితెరపై ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ కథల్లో అగ్ర కథానాయకులు నటించినప్పుడు వాటికి వచ్చే ఆదరణ కూడా అంతేస్థాయిలో ఉంటుంది. పెద్దగా పేరున్న నటులు లేకపోయినా, బలమైన కథ, కథనాలు ఉన్న సినిమాలకు ప్రేక్షకులు నీరాజనం పడతారు. ఇలాంటి ప్రయోగమే చేసి ‘భక్షక్‌’ను ఒక ఎమోషనల్ డ్రామాగా మలచడంలో దర్శకుడు పుల్‌కిత్‌ మెప్పించారు.

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నవారు నేటి సమాజంలోనూ ఎందరో ఉన్నారు. అలాంటివారిని చేరదీసి వారితో సామాజిక సేవ పేరుతో వ్యభిచారం దగ్గరి నుంచి మానవ అక్రమరవాణా వరకూ సాగించిన ఉదంతాలు కోకొల్లలు. అలాంటి వాటిపై ఒక జర్నలిస్ట్‌, అదీ మహిళ సాగించే పోరాటమే ‘భక్షక్‌’. (bhakshak review in telugu) బన్సీలాల్‌ నడిపే అనాథ బాలికల వసతి గృహం, అందులో జరిగే దుశ్చర్యలను తెలియజేస్తూ సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నెమ్మదిగా వైశాలి, ఆమె కుటుంబాన్ని పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. వైశాలికి ఆ వసతిగృహం గురించి నివేదిక దొరికిన దగ్గరినుంచే కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. ఎక్కడా కూడా కమర్షియల్‌ హంగుల జోలికిపోకుండా, ఈ క్రమంలో ప్రతి సన్నివేశాన్ని సహజత్వానికి దగ్గరగా చూపిస్తూ దర్శకుడు కథను నడిపిన తీరు బాగుంది. వైశాలి కథనాలకు బన్సీలాల్‌, అతని రౌడీలు స్పందించటం, అలాంటివి ప్రసారం చేయొద్దని హెచ్చరించడం వంటి సన్నివేశాలు రొటీన్‌గానే ఉన్నా, సరైన ఆధారాల కోసం వైశాలి చేసే ప్రయత్నాలు అలరిస్తాయి.

నడి సంద్రంలో దిక్కుతోచక సాగుతున్న వ్యక్తికి ఆధారం దొరికినట్లు ఎస్పీ జస్మీత్‌కౌర్‌ (సాయి తమంకర్‌) వచ్చిన తర్వాతే కథనం మరింత వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బన్సీలాల్‌ను ఎదుర్కొనేందుకు వైశాలి ఆడే డ్రామా మెప్పిస్తుంది. అనాథ బాలికలను కాపాడినప్పుడు వచ్చే పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయి. ‘సిస్టమ్‌ ఇలాగే ఉంటుంది. ఒక చేత్తో అధికారం ఇస్తుంది. మరొక చేత్తో అదే అధికారాన్ని లాక్కుంటుంది.  న్యాయస్థానానికి  వాస్తవాలతో సంబంధం లేదు. (bhakshak review in telugu)  కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి’ వంటి సంభాషణలు మెప్పిస్తాయి. ‘ఏదైనా విచారకర సంఘటన జరిగినప్పుడు మనమంతా సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌టాగ్‌ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేస్తాం. మానవత్వపు విలువను సోషల్‌మీడియా శూన్యంలోకి నెట్టేస్తోంది. మన దైనందిన జీవితాల్లో వార్తల కన్నా ఎన్నో అంశాలున్నాయి. కానీ, వాటిపై స్పందించడానికి మనకు సమయం ఉండదు. టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌, మసాలా వార్తలను చూడటానికి మాత్రం టైమ్‌ ఉంటుంది.’’ అంటూ వైశాలి ఇచ్చే స్పీచ్‌ నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది.

ఎవరెలా చేశారంటే:  జర్నలిస్ట్‌ వైశాలి పాత్రలో భూమి పెడ్నేకర్‌ ఒదిగిపోయి నటించింది. ఆ పాత్రను ఆకళింపు చేసుకుని, సాటి మహిళల రక్షణ కోసం పోరాడే యువతిగా మెప్పించింది. సంజయ్‌ మిశ్రా, సాయి తమంకర్‌, ఆదిత్య శ్రీవాత్సవ ఇలా ప్రతిఒక్కరూ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బడ్జెట్‌ పరిమితులను దృష్టిలో పెట్టుకుని కేవలం ఓటీటీ కోసమే తీసిన సినిమా ఇది.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు ఆడియోలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • బలాలు
  • + మెసేజ్‌
  • + భూమి పెడ్నేకర్‌ నటన
  • + సాంకేతిక విభాగం పనితీరు
  • బలహీనతలు
  • - తెలిసిన కథే
  • - పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం
  • చివరిగా: ‘భక్షక్‌’.. మెస్సేజ్‌ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌ విత్‌ బ్రిలియెంట్‌ పెర్ఫామెన్స్‌ (bhakshak review in telugu)
  • గమనిక:  ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని