మెహ్రీన్‌ని ప్రేమించా కానీ.. : భవ్య బిష్ణోయ్‌

మెహ్రీన్‌ని తాను ఎంతగానో ప్రేమించానని హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్యా బిష్ణోయ్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలో మెహ్రీన్‌-భవ్యా బిష్ణోయ్‌ల నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే....

Published : 05 Jul 2021 10:29 IST

నిశ్చితార్థం రద్దు కావడంపై పెదవి విప్పిన భవ్య

హైదరాబాద్‌: మెహ్రీన్‌ని తాను ఎంతగానో ప్రేమించానని హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా పెళ్లిని కొంతకాలం వాయిదా వేస్తున్నామని అప్పట్లో మెహ్రీన్‌ వెల్లడించారు. అయితే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మెహ్రీన్‌ తాజాగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఇకపై భవ్య, వాళ్ల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

కాగా.. నిశ్చితార్థం రద్దు కావడంపై నెటిజన్ల నుంచి పలు కామెంట్లు వస్తున్నాయి. మెహ్రీన్‌కి‌.. బిష్ణోయ్‌, అతని కుటుంబం సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో వస్తోన్న పోస్టులపై భవ్య స్పందించారు. ‘మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని జులై 1నే మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం. మెహ్రీన్‌ పరిచయమైన నాటి నుంచి ఆమెను ఎంతో ప్రేమించాను. ఆమె కుటుంబాన్ని కూడా గౌరవించాను. మా ఇద్దరిది మంచి జోడీ అవుతుందని భావించాను. కానీ కాలం మా జీవితాలను వేరేలా చేసింది. మెహ్రీన్‌ నుంచి విడిపోతున్నందుకు నేను బాధపడడం లేదు.

నిశ్చితార్థం రద్దు విషయంలో నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఎవరైనా కామెంట్లు చేస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటాను. నాకు, నా కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం ఉంది. మెహ్రీన్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను. ఆమెతోపాటు ఆమె కుటుంబాన్ని, స్నేహితుల్ని ఎప్పుడూ ఉన్నతంగానే చూశాను. మా ప్రేమానురాగాలను జీవితాంతం నెమరువేసుకుంటాను’ అని భవ్య బిష్ణోయ్‌ పోస్ట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని