Chiranjeevi: భవిష్యత్తుపై భయంతోనే వాటిల్లో నటించేవాణ్ని: చిరంజీవి

చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘భోళాశంకర్‌’. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడారు.

Updated : 07 Aug 2023 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే భయంతోనే వేరే హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించేవాడినని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. తన కొత్త చిత్రం ‘భోళాశంకర్‌’ (Bholaa Shankar) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. ఈయన హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన చిత్రమిది. తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా నటించారు. సుశాంత్‌ మరో కీలక పాత్ర పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో వేడుక నిర్వహించింది (Bholaa Shankar Pre Release Event).

చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘అమ్మ ప్రేమ ఎప్పటికీ బోర్‌ కొట్టదు. అభిమానుల ప్రేమ అంతే.  సినిమా అయినా, సామాజిక కార్యక్రమం అయినా నా అభిమానులు గర్వపడేలా ఉండాలని చూసుకుంటా. వారి కోసం నా వ్యక్తిత్వాన్ని, నడవడికను మార్చుకుంటూ వచ్చా. మీ అందరి వల్ల ఈ స్థాయికి చేరుకున్నా. సుమారు దశాబ్దాల నుంచి నాతో ప్రయాణిస్తున్న ఫ్యాన్స్‌తోపాటు ఈతరం యువత నా సినిమా వేడుకకు వచ్చారంటే వీరి ప్రేమని ఏమని వర్ణించను. ‘నాకు నచ్చితేనే చేస్తాను. నాకు నచ్చితేనే చూస్తాను’ అని నా ‘ఖైదీ నం. 150’ సినిమాలో డైలాగ్‌ ఉంది. ‘భోళాశంకర్‌’ నాకు నచ్చింది కాబట్టే చేశాను. నాకు నచ్చింది కాబట్టే చూశాను. ఈ సినిమా మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా. ‘రీమేకులు చేస్తారేంటి’ అని చాలామంది అంటుంటారు. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నం చేస్తే తప్పేంటో నాకు అర్థంకావట్లేదు. ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘భోళాశంకర్‌’ మాతృక చిత్రం ‘వేదాళం’ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో లేదు. ఎవరూ చూసి ఉండరు. అదే ధైర్యంతో దర్శకుడు మెహర్‌ రమేశ్‌, నిర్మాత అనిల్‌ సుంకర నా దగ్గరకు వచ్చారు. ‘ఇటీవల ‘లూసిఫర్‌’ కమిట్‌ అయ్యా. మళ్లీ రీమేక్‌ అంటే అభిమానులు గొడవ చేస్తారు’ అని సమాధానమిచ్చా. ‘బెస్ట్‌ కంటెంట్‌ని ఎందుకు రీమేక్‌ చేయకూడదు. మీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దాన్ని అందివ్వకూడదా?’ అని సందేహం వ్యక్తం చేశారు. ఏ ఓటీటీలోనూ ‘వేదాళం’ లేదని తెలుసుకున్నాకే, ఎందుకు చేయకూడదని అనిపించింది’’

ఇండస్ట్రీ పుష్పకవిమానంలాంటిది..

‘‘కొన్ని సినిమాల విషయంలో ఔట్‌పుట్‌ ఎలా వస్తుందోనని కాస్త టెన్షన్‌ ఉంటుంది. కానీ, ఈ సినిమా విషయంలో అలా కాదు. షూటింగ్‌లో పాల్గొన్న ప్రతి రోజూ సరదాగా ఉండేది. ‘ఈ సినిమా సూపర్‌హిట్‌’ అని మా అందరి మనసులో నాటుకుపోయింది. ఆ ఫీలింగే మమ్మల్ని ముందుకు నడిపించింది. చిన్నప్పటి నుంచి మెహర్‌ రమేశ్‌ నాకు తెలుసు. హాలీడేస్‌కు మా ఇంటికి వచ్చి, నన్ను గమనించేవాడు. నన్ను చూసే తను చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. ‘చిరంజీవి అన్నయ్య, పవన్‌ కల్యాణ్‌ తెలుసు’ అనే రికమెండేషన్లు లేకుండా స్వయంకృషితో దర్శకుడిగా మారాడు. ‘ఈ ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదు. టాలెంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇక్కడ స్థానముంటుంది’’ అని తమ్ముడు కల్యాణ్‌ తన ‘బ్రో’ సినిమా వేడుకలో అన్నాడు. నేనూ అదే చెబుతున్నా. మా ఇంటి హీరోలను మేం పుష్‌ చేసేందుకు ప్రయత్నించం. బయట నుంచి యంగ్‌ టాలెంట్‌ వస్తుందంటే దాన్ని ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మా ఇమేజ్‌ ఉపయోగపడుతుందంటే ముందుకొస్తాం. అలాంటి వారికి చేయూతనివ్వడాన్ని బాధ్యతగా భావిస్తా. కొత్తతరం సినిమాల్లోకి రావాలి. వారి ఆలోచనలతో సినిమా పరిశ్రమ మరింత ఎత్తుకు ఎదగాలి. మా సీనియర్ల వల్ల కాదు యంగ్‌స్టర్స్‌ వల్ల ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మకంగా అడుగుపెడితే ఈ పరిశ్రమ మీకు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇండస్ట్రీ.. పుష్పక విమానం, అక్షయపాత్రలాంటిది’

రాణిస్తాననే నమ్మకం ఉండేది..

‘‘కేవలం స్టార్స్‌ మాత్రమే ఉన్న ఇండస్ట్రీలోకి బిక్కుబిక్కుమనుకుంటూ ప్రవేశించా. కానీ, ఇక్కడ రాణిస్తాననే నమ్మకం గట్టిగా ఉండేది. ‘కొత్త అల్లుడు’లో ఓ చిన్న పాత్ర పోషించమన్నారు. బాధతోనే నటించా. ‘కొత్తపేట రౌడీ’లో కృష్ణగారి పక్కన చిన్న వేషం వెయ్యవయ్యా’ అని అనేవారు. ఓ వైపు నేను ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’, ‘శుభలేఖ’ చేస్తున్నానని, వేరే సినిమాల్లో చిన్న పాత్రలు పోషిస్తే బాగోదేమోనన్న సందేహం వెలిబుచ్చా. ‘చేయండి సర్‌’ అంటూ గంభీర స్వరంతో సమాధానమిచ్చేవారు. చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోననే భయంతో చేశా. నన్ను ప్రోత్సహించి, భుజానికెత్తుకుంది ప్రేక్షకులు. ఇండస్ట్రీకి చెందిన వారు నాకు సెకండరీ’’ అని భావోద్వేగంగా మాట్లాడారు.

సినిమా టీమ్‌ గురించి మాట్లాడుతూ.. ‘మెహర్‌ దర్శకుడిగా ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశాడు. ఛాయాగ్రాహకుడు డడ్లీ అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఆర్ట్ డైరెక్టర్‌ ఎ.ఎస్‌. ప్రకాశ్‌ టాలెంట్‌కి ఫిదా అయ్యా. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ ఇంకా పనిలో నిమగ్నమై ఉన్నారు. మణిశర్మ అబ్బాయి మహతి స్వరసాగర్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. పాత్ర నిడివి ఎంత ఉన్నా సరే నటిస్తానంటూ ముందుకొచ్చిన సుశాంత్‌కు థ్యాంక్స్‌. తమన్నా లాయరుగా నటించింది. ఈరోజుల్లో అద్భుతమైన నటి ఎవరంటే.. తను కీర్తిసురేశ్‌. మా ఇంటి బిడ్డలా అనిపిస్తుంది. మేమిద్దరం ఇందులో అన్నాచెల్లెలుగా నటించాం. అది సినిమా వరకే పరిమితంకావాలని, బయట అన్నయ్య అని పిలవొద్దని చెప్పా (నవ్వుతూ). మహానటి చిత్రంలోని కీర్తి నటన చూశాక నాకు మాటలు రాలేదు’’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో కీర్తిసురేశ్‌, సుశాంత్‌, మెహర్‌ రమేశ్‌, దర్శకులు బుచ్చిబాబు, బాబీ తదితరులు పాల్గొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని