Chiranjeevi: సీఎం సానుకూలంగా స్పందించారు.. త్వరలోనే ఆమోదయోగ్యమైన నిర్ణయం: చిరంజీవి

‘‘ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. సీఎం నన్ను ఓ సోదరుడిగా పంగడ వేళ భోజనానికి ఆహ్వానించి, నాతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు బాగా నచ్చింది.

Updated : 13 Jan 2022 16:39 IST

గన్నవరం: తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన భేటీ సంతృప్తినిచ్చిందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. సీఎం ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో ఆయనతో చిరంజీవి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ తిరుగుప్రయాణంలో గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

ఓ సోదరుడిగా నన్ను ఆహ్వానించారు..

‘‘ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. సీఎం నన్ను ఓ సోదరుడిగా పండగ వేళ భోజనానికి ఆహ్వానించి, నాతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు బాగా నచ్చింది. ఆయన సతీమణి భారతిగారూ వడ్డించటం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సినిమా టికెట్‌ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఓ వైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెప్తున్న ప్రభుత్వం మరోవైపు. కొలిక్కిరాని ఈ సమస్య జటిలమవుతోన్న నేపథ్యంలో సీఎం గారు ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటం కాదు రెండో కోణంలోనూ వినాలని అన్నారు. ఆయన నాపై పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది’’

‘‘సామాన్యుడికీ వినోదం అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమానుల  సాధకబాధకాల గురించి ఆయనకు వివరించా. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని, కమిటీ తుది నిర్ణయానికొస్తుందని తెలిపారు’’ అని చిరంజీవి వివరించారు.

వాళ్లందరి కష్టాల్ని సీఎంకు వివరించా..

‘‘చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కార్మికులున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. కొవిడ్‌/లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధిలేక వారి కడుపు నిండలేదు. అందుకే  వారి గురించే ఎక్కువగా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. థియేటర్లు మూసివేయాల్సి వస్తుందనే అభద్రతాభావంతో థియేటర్ల యజమానులున్నారు. వీళ్లందరి కష్టాల్ని సీఎంకు తెలియజేశా. తాను ఒక పక్షానే ఉండనని, అందరినీ సమదృష్టితో చూస్తానని ఆయన చెప్పారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. ఆ మాటతో నాకు ధైర్యం వచ్చింది. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని, నా ద్వారా చిత్ర పరిశ్రమకు తెలియజేయాలన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైతే దాన్ని జీవోగా ఇస్తామని తెలిపారు’’. 

ఎవరూ మాటలు జారొద్దు..
‘‘మీరెవరూ (ఇండస్ట్రీ వారు) వ్యక్తిగతంగా స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని ఇండస్ట్రీ పెద్దగా కాదు.. సినీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలోనే ఆమోదయోగ్యమైన జీవో వస్తుందనే నమ్మకం ఉంది. ఐదో ఆట ప్రదర్శన గురించి సీఎంకు వివరించా. నామమాత్రంగా కాకుండా అన్నింటినీ ఆయన అర్థం చేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ చర్చ గురించి పరిశ్రమలోని పెద్దలందరికీ వివరిస్తా. వారు ఏమైనా సూచనలిస్తే వాటిని తీసుకుని మరోసారి సీఎంను కలుస్తా. ఉద్దేశపూర్వకంగా నేనొక్కడినే ఈ భేటీకి హాజరవలేదు. ఆయన ఆహ్వానిస్తేనే వచ్చా. తప్పకుండా త్వరలోనే అన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పడుతుంది’’ అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని