DeviSri Prasad: 25 ఏళ్ల మ్యూజికల్ జర్నీ.. కల నెరవేరిందంటూ పోస్ట్‌ పెట్టిన దేవీశ్రీ ప్రసాద్‌

తన 25 ఏళ్ల కెరీర్‌పై సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ పోస్ట్‌ పెట్టారు. 

Published : 13 Mar 2024 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన పాటలతో సంగీత ప్రియులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (DeviSri Prasad). ఈ టాలెంటెడ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తాజాగా దీనిపై ఆయన పోస్ట్‌ పెట్టారు. తన గురువు ఇళయరాజా తన స్టూడియోకు రావడంతో కల నెరవేరిందన్నారు. ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు.

‘చిన్నతనంలో సంగీతం అంటే ఏమిటో తెలియనప్పుడే ఇళయరాజా సంగీతం వింటుంటే అద్భుతంగా అనిపించేది. పరీక్షలకు చదువుకునే సమయంలోనూ ఆయన పాటలు వింటూ ఉండేవాడిని. ఆయన సంగీతం నాకు ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే నేను సంగీత దర్శకుడిగా ఎదిగాను. సంగీత దర్శకుడినయ్యాక నా స్టూడియోలో ఇళయరాజా పెద్ద ఫొటో పెట్టుకున్నాను. ఆయన ఒక్కరోజైనా నా స్టూడియోకు వచ్చి ఇక్కడ నిల్చుంటే కలిసి ఫొటో దిగాలని కలలు కన్నాను. ఈరోజు నా కల నిజమైంది. దీన్ని జీవితంలో మర్చిపోలేను. ఆయన రాకతో నా స్టూడియోకు ఆధ్యాత్మికత వచ్చింది’ అని రాసుకొచ్చారు. ఈసందర్భంగా తనకు అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు, అభిమానిస్తున్న ప్రేక్షకులకు దేవీశ్రీ ప్రసాద్‌ ధన్యవాదాలు చెప్పారు.

 కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?

1999లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు దేవీశ్రీ ప్రసాద్‌. మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆనందం’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘సొంతం’, ‘వర్షం’.. ఇలా ఎన్నో సినిమాలకు మ్యూజిక్‌ అందించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అత్యధికంగా 11 సార్లు నామినేటై రికార్డు సృష్టించారు. ‘పుష్ప’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని