Dhamaka: పండగ లాంటి చిత్రం ‘ధమాకా’

‘ధమాకా’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు.

Updated : 19 Dec 2022 06:51 IST

‘ధమాకా’తో (Dhamaka) వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు రవితేజ (Raviteja). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల (Sree Leela) కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ..‘‘సినిమా కచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నా. రచయిత ప్రసన్న కుమార్‌లోని హ్యూమర్‌ నాకు చాలా ఇష్టం. ఈ చిత్రానికి తను చాలా మంచి కథ రాశాడు. అందంతో పాటు ప్రతిభ, ఎనర్జీ.. సమపాళ్లలో ఉన్న నాయిక శ్రీలీల. తను వచ్చే ఏడాది కల్లా మరోస్థాయికి వెళ్తుందని నమ్ముతున్నా. ఈ చిత్రంతో భీమ్స్‌ మరో మెట్టు ఎక్కుతాడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఏ ముహూర్తాన పెట్టారో కానీ నిజంగానే అదొక ఫ్యాక్టరీ అయిపోయింది. ఈ బ్యానర్‌లో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘నా ‘అల్లరి ప్రియుడు’ చిత్రంలో డ్రమ్మర్‌గా చిన్న పాత్ర చేశారు రవితేజ. అతను వాయించిన తీరు చూసి నేను అప్పుడే ఫిక్స్‌ అయ్యిపోయా.. తను ఎప్పుడో ఒకప్పుడు ఇండస్ట్రీని వాయించేస్తాడని, ఓ పెద్ద మాస్‌ మహారాజా అవుతాడని. శ్రీలీల కూడా నా ‘పెళ్లి సందడి’ చిత్రంతోనే చిత్రసీమకు పరిచయమైంది. ఇద్దరూ మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని.. మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సినిమా అదిరిపోయింది. నేనూ రవితేజ అభిమానినే. తను ఎలా చేస్తే థియేటర్లో ప్రేక్షకుడు ఎగిరి గెంతేస్తాడో అలాగే తెరకెక్కించాం. కచ్చితంగా రవితేజ అభిమానులకు పండగ లాంటి చిత్రమిది. దీనికి ప్రసన్నకుమార్‌ అదిరిపోయే డైలాగులు రాశారు. భీమ్స్‌ అద్భుతమైన సంగీతమందించారు. ఓ మాస్‌ కథకు ఎలాంటి పాటలివ్వాలో తను అలాంటి పాటలిచ్చారు. శ్రీలీల నటన, డ్యాన్సులు అందరినీ కట్టిపడేస్తాయి’’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘రవితేజతో కలిసి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పెద్ద కమర్షియల్‌ హిట్‌గా నిలుస్తుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు. ‘‘రవితేజ ఎలా చేస్తే బాగుంటుంది.. ఏం చెప్తే బాగుంటుంది.. ఆయన్ని ఎలా చూపిస్తే ప్రేక్షకులు మెచ్చుతారు అన్నది దృష్టిలో పెట్టుకుని చేసినదే ఈ ‘ధమాకా’’ అన్నారు రచయిత ప్రసన్న కుమార్‌. నాయిక శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘పెళ్లి సందడి’ విడుదలవ్వక ముందే.. నాపై నమ్మకంతో ఈ చిత్రానికి నన్ను ఎంపిక చేశారు దర్శకుడు త్రినాథరావు. ఆయనకు కృతజ్ఞతలు. ‘ధమాకా’ మీ అందరి కోసం తీసిన సినిమా. విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అంది. ఈ కార్యక్రమంలో శ్రీవాస్‌, బీవీఎస్‌ రవి, కృష్ణ చైతన్య, నందినిరెడ్డి, మారుతి, అవసరాల శ్రీనివాస్‌, సముద్రఖని, విజయ్‌ కనకమేడల, భీమ్స్‌ సిసిరోలియో, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌, రామ్‌ లక్ష్మణ్‌, ప్రసన్న కుమార్‌ బెజవాడ, ఆది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని