Captain Miller: తెల్లదొరలపై ‘కెప్టెన్‌ మిల్లర్‌’ తిరుగుబాటు

ఈ ఏడాది ఆరంభంలో ‘సార్‌’ సినిమాతో సందడి చేశారు కథానాయకుడు ధనుష్‌. ఇప్పుడు ‘కెప్టెన్‌ మిల్లర్‌’గా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 29 Jul 2023 14:32 IST

ఏడాది ఆరంభంలో ‘సార్‌’ సినిమాతో సందడి చేశారు కథానాయకుడు ధనుష్‌. ఇప్పుడు ‘కెప్టెన్‌ మిల్లర్‌’గా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్నారు. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్‌ కథానాయిక. శివ రాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం ధనుష్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో హీరో సందీప్‌ కిషన్‌ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. దాదాపు నిమిషంన్నర నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో ఆద్యంతం తుపాకుల మోతే వినిపించింది. బందిపోటుగా.. హంతకుడిగా ముద్రపడిన కెప్టెన్‌ మిల్లర్‌ను పట్టుకోవడం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం రంగంలోకి దిగడం.. వాళ్ల పోలీసు సైన్యంపై మిల్లర్‌, అతని బృందం తిరగబడటం.. ఆఖర్లో మిల్లర్‌ ఓ భారీ మిషన్‌ గన్‌తో బ్రిటిష్‌ సైన్యంపై కాల్పులు జరపడం ఆసక్తి రేకెత్తించింది. 1930-40ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో ధనుష్‌ ఓ సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. తెల్లదొరల నుంచి సామాన్య ప్రజల్ని రక్షించే విప్లవ వీరుడిగా ఆయన కనిపించనున్నట్లు అర్థమవుతోంది. అలాగే ఇందులో ప్రియాంక మోహన్‌ పాత్ర కూడా యాక్షన్‌ కోణంలో సాగనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని