Samantha: ఆ సినిమా కథకు, సమంత లైఫ్‌కు సంబంధం లేదు: డైరెక్టర్‌ శివ నిర్వాణ

విజయ్‌ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాకి సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా శివ మీడియాతో మాట్లాడారు.

Published : 29 Aug 2023 22:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను రాసిన ‘ఖుషి’ (Kushi) సినిమా కథకు, సమంత (Samantha) జీవితానికి ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తెలిపారు. మూడేళ్ల క్రితమే ఆ స్టోరీ రాశానని చెప్పారు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత జంటగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. సినిమా గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

అదేంటో థియేటర్లలోనే తెలుస్తుంది..!

‘‘పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యలతో గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాలో టైటిల్‌కు తగినట్లుగా వినోదాత్మకంగా కథను చెప్పాలని అనుకున్నా. ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదల తర్వాత విజయ్‌కి ఈ కథ చెప్పా. ఆ తర్వాత, ఏడాదిన్నరకు సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాం. ‘ఖుషి’.. మణిరత్నం ‘సఖి’ సినిమా తరహాలో సాగుతుందనే వార్తలు ఇటీవల వచ్చాయి. కానీ, ఇందులో ఓ యూనిక్ పాయింట్ ఉంటుంది. ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఓ సమస్యని విజయ్, సమంతలాంటి స్టార్స్‌తో ప్రస్తావిస్తే బాగుంటుందనుకున్నా. వారికీ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. దాన్ని ట్రైలర్‌లో చూపించలేదు. థియేటర్లలోనే చూసి తెలుసుకోవాలి’’

సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న అల్లు అర్జున్‌, విజయ్‌.. ఆసక్తి రేకెత్తించేలా పోస్ట్‌లు

అందుకే కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌

‘‘నేను గతంలో తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ చిత్రాల్లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించా. ఖుషి వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి ముందుగా ‘సరదా’ సహా మరికొన్ని టైటిల్స్‌ అనుకున్నా. కానీ, విజయ్, సమంతకు ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, అన్ని భాషల్లో ఒకే పేరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చివరకు ‘ఖుషి’ని ఖరారు చేశాం. ప్రేమ కథను కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కశ్మీర్ బ్యాక్ డ్రాప్. ఫస్టాఫ్‌లో కనిపించే ప్రేమకథను కాలేజీలో చూపించకుండా ఓ ఆహ్లాదరక వాతావరణంలో చిత్రీకరిస్తే బాగుంటుని అనిపించింది. సమంత డెడికేషన్‌ ఉన్న నటి. అలాంటి ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే మేమంతా సపోర్ట్‌ చేయకుండా ఎలా ఉంటాం? ట్రీట్‌మెంట్‌ మధ్యలో వచ్చి నటిస్తానని చెప్పేదిగానీ పూర్తిగా నయమైన తర్వాతే రమ్మని చెప్పాం’’

సమంతను ఎంపిక చేయడానికి కారణమదే..

‘‘కొందరు అనుకుంటున్నట్లు ‘ఖుషి’ సినిమా కథకు సమంత వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ‘మజిలీ’ సినిమా కోసం ఆమెతో కలిసి పనిచేశా కాబట్టి ‘ఖుషి’లోని పాత్రకు న్యాయం చేయగలదనే నమ్మకంతో ఎంపిక చేశా. నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే చేసిందంతే. మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తే ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఉండేది కాదు. ఇందులో హిందూ- ముస్లిం మధ్య గొడవలు చూపించట్లేదు. ఓ సున్నితమైన అంశాన్ని చర్చించాం’’

అలానే తెరకెక్కించాలని అనుకోను!

‘‘నేను దర్శకుడు మణిరత్నం అభిమానిని. ఆయన సినిమాలను బాగా ఇష్టపడతా. కానీ, అలానే తెరకెక్కించాలని అనుకోను. నా కెరీర్‌ ప్రారంభంలో చెన్నై వెళ్లి ఆయన దగ్గర పని చేయాలనుకున్నా. వారంపాటు ప్రయత్నించినా ఆయన్ను కలవడం కుదరలేదు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ-2 వంటి సినిమాలను ఆయా దర్శకులు తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించినవే. అవి ఇతర భాషల వారికీ నచ్చాయి. మన నేటివిటీకి తగ్గట్లు సినిమాని బాగా తెరకెక్కిస్తే అది ఇతర చిత్ర పరిశ్రమల వారికీ నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుందనేది నా అభిప్రాయం’’ అని శివ నిర్వాణ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని