kalki: ‘కల్కి’లో దుల్కర్‌.. పరోక్షంగా చెప్పేశాడుగా..!

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో దుల్కర్‌ సల్మాన్ ఉన్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై దుల్కర్‌ (Dulquer Salmaan) స్పందించారు.

Published : 18 Aug 2023 14:29 IST

హైదరాబాద్‌: నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). దీని కోసం ప్రభాస్‌ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అందుకే దీనికి సంబంధించిన చిన్న అప్‌డేట్‌ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరలవుతోంది. తాజాగా ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) నటించనున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దుల్కర్ స్పందించారు.

తన కొత్త సినిమా ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King of Kotha) ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్‌ .. ‘కల్కి’ గురించి మాట్లాడారు. ‘‘నేను ఈ సినిమాలో భాగమా.. కాదా.. అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. కానీ, నేను ‘కల్కి’ సెట్‌కు వెళ్లినప్పుడు ఆశ్చర్యపోయా. కేవలం నాగ్‌ అశ్విన్‌ మాత్రమే అంత గొప్పగా సినిమా తీయగలరు. అలాంటి ఆలోచనలు ఆయనకు మాత్రమే వస్తాయి. తన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’కి(Yevade Subramanyam) అలాగే ‘మహానటి’ సినిమాకు సంబంధం ఉండదు. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ కూడా అంతే.. చాలా కొత్తగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన కథగా ఇది రూపొందుతోంది’’ అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కాంబినేషన్‌లో మీకు సన్నివేశాలున్నాయా.. అని అడగ్గా.. ‘అలాంటి విషయాలు మేకర్స్‌ మాత్రమే చెప్పాలి’’ అని దుల్కర్‌ అన్నారు. ఈ సమాధానం విన్న అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు.

ప్రభాస్‌ అభిమానులకు విజువల్‌ ట్రీట్‌.. ఐమాక్స్‌లో ‘సలార్‌’

ఇప్పటికే ‘కల్కి’లో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు.  ఇప్పుడు దుల్కర్‌ చెప్పిన ఈ సమాధానంతో ఆయన కూడా ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇక శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.  ప్రభాస్ (Prabhas) సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవల కామికాన్‌ వేదికగా విడుదల చేసిన ‘కల్కి’ ఫస్ట్‌ గ్లింప్స్‌నకు విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని