Baahubali: ‘బాహుబలి’ ఇంటర్వెల్‌.. మొదట అనుకున్నట్టుగా తీసి ఉంటే!

ప్రభాస్‌, రానా, అనుష్క, నాజర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్‌’. 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలివీ..

Updated : 10 Jul 2023 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా ‘బాహుబలి’ (Baahubali). ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు, అత్యధిక వసూళ్లు, ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమాకి 8 ఏళ్లు. ప్రభాస్‌ (Prabhas), రానా (Rana Daggubati), అనుష్క (Anushka Shetty), తమన్నా (Tamannaah Bhatia), రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ల నటన.. రాజమౌళి (Rajamouli) టేకింగ్‌, ఎం. ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్‌ కెమెరా వర్క్‌ ఇలా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జులై 10, 2015న విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ (Baahubali: The Beginning) గురించి ఆసక్తికర విషయాలు మీకోసం (8 Years For Baahubali)..

అలా అనుకున్నారు.. ఇలా తీశారు!

ప్రస్తుతం ఉన్న సినిమాలో బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్‌ వస్తుంది. కానీ, తొలుత వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్‌ వేద్దామనుకున్నారు దర్శకుడు రాజమౌళి. ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో. నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగొచ్చాడు’ అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి రూపం రావడంపై ఇంటర్వెల్‌ ఇవ్వాలి. దాని కన్నా ముందు శివుడు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం.. ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. కానీ, ఈ సన్నివేశాన్ని ఇలా తీద్దామనుకోలేదు. శివుడు మాహిష్మతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు. ‘ప్రభూ.. నన్ను ఏమీ చేయొద్దు’ అని వేడుకుంటాడు.

అతడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి, బిజ్జలదేవుడికి విషయం చెబుతాడు. కానీ, బిజ్జలదేవుడు నమ్మడు. ‘బాహుబలి చచ్చిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేశాం’ అని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు కొట్టుకుని శివుడు రావాలి. ‘వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశాం’ అనగానే అగ్ని కీలలను దాటుకుంటూ రావాలి. ఇలా బిజ్జలదేవుడు చెప్పే ఒక్కో డైలాగ్‌కు ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీద్దామనుకున్నాం. అక్కడ ఇంటర్వెల్‌ వేద్దామనుకున్నాం. కానీ, విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్‌ వేస్తే బాగుంటుందని భావించి బిజ్జలదేవుడి డైలాగ్స్‌ అన్నీ తీసేశాం. శివుడి మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను ‘నిప్పులే శ్వాసగా’ అంటూ సాంగ్‌లా తీశాం’’ అంటూ రాజమౌళి ఓ సందర్భంలో పంచుకున్నారు.

కోతిని పెట్టాలనుకున్నారు.. కానీ, 

‘బాహుబలి- 1’లో శివుడితో పాటు ఓ కోతిని కూడా పెట్టాలని రాజమౌళి అనుకున్నారట. జలపాతం దగ్గర కొమ్మను పట్టుకునేందుకు దూకినప్పుడు మొదటిసారి శివుడు కింద పడిపోతాడు. కానీ, కోతి మాత్రం దూకేసి పైకి వెళ్లిపోయి, కొన్ని రోజులకు నగల మూటతో కిందకు వస్తుందని, ఆ నగలను చూసి అవంతిక రూపాన్ని శివుడు చెక్కుతాడని సన్నివేశం రాసుకున్నారు. కోతిని పెట్టి సినిమా తీయడం నిబంధనలకు విరుద్ధం. కోతిని సీజీలో షూట్‌ చేసినా, సహజంగా కనిపించేందుకు ఓ సన్నివేశాన్నైనా నిజమైన కోతిని పెట్టి తీయాల్సిందే. అమెరికాలో శిక్షణ తీసుకున్న ఓ కోతిని కూడా సినిమా కోసం బుక్‌ చేశారట రాజమౌళి.

ఇక్కడి కోతి అయినా, అమెరికా కోతి అయినా, నిబంధనలు ఒకటేనని సెన్సార్‌ వాళ్లు చెప్పడంతో ఆ నిర్ణయం విరమించుకుని అవంతిక మాస్క్‌ ఐడియాను డెవలప్‌ చేశారు. అలా జలపాతం నుంచి పడిన మాస్క్‌ను ఊహించుకుని ఇసుకపై బొమ్మగీస్తాడు శివుడు. ఆ తర్వాత అదే ఊహతో జలపాతం పైకి వెళ్తాడు. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ కూడా సంచలనమైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని