Tollywood: సినిమా షూటింగ్‌లపై కీలకనిర్ణయం 

కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గురువారం సమావేశమైంది. షూటింగ్‌లపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తుది దశలో ఉన్న సినిమా చిత్రీకరణలు పూర్తి చేయాలని ప్రకటించింది.

Updated : 17 Jun 2021 19:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గురువారం సమావేశమైంది. షూటింగ్‌లపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తుది దశలో ఉన్న సినిమా చిత్రీకరణలు పూర్తి చేయాలని ప్రకటించింది. ఆ తర్వాతే కొత్త సినిమాల షూటింగ్‌లు ప్రారంభించాలని సూచించింది. షూటింగ్స్‌కు హాజరయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యుల నుంచి నిర్మాణ సంస్థలు కరోనా టీకా తీసుకున్నట్లు నిర్ధారించాకే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఒక్కడోసు వేసుకున్నవారిని కూడా షూటింగ్‌లోకి అనుమతించాలని తీర్మానించారు. ఆగిపోయిన సినిమాలకు సంబంధించి దర్శకులు తమ షెడ్యుల్‌ను కుదించుకొని వీలైనంత తక్కువ సమయంలోనే షూటింగ్‌ పూర్తి చేసేలా చూడాలని నిర్ణయించింది. షూటింగ్‌ సమయంలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని చెప్పింది.


మొదలుపెట్టేది మామా అల్లుళ్లేనా?!

చిత్రీకరణలు షురూ అయ్యాయి. ఇప్పుడందరి దృష్టి థియేటర్లపైనే. రెండో దశ కరోనా తగ్గుముఖం పట్టగానే చిత్రీకరణల కోసం ధైర్యంగా రంగంలోకి దిగినట్టుగానే... థియేటర్లు తెరుచుకున్న వెంటనే సినిమాల్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కరోనాపై అవగాహన పెరగడంతోపాటు..వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతోంది కాబట్టి ప్రేక్షకులు ఇదివరకటి కంటే ధైర్యంగా వస్తారని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. తొలి దశ కరోనా తర్వాత ప్రేక్షకులు వస్తారో లేదో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ మంచి సినిమాలు విడుదలైన వెంటనే ప్రేక్షకులు థియేటర్లకి వచ్చారు. ఇప్పుడూ అదే తరహా స్పందన లభిస్తుందనేది నిర్మాతల నమ్మకం. యాభై శాతం ప్రేక్షకులతో అనుమతులు లభించినా ఈసారి బాక్సాఫీసు ముందుకు సినిమాలు వరుస కట్టే అవకాశాలున్నాయి. వచ్చే నెలలోనే తెరపై బొమ్మ పడొచ్చని, అగ్ర తారలు నటించిన భారీ బడ్జెట్‌ చిత్రాలేమో వంద శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు మొదలైనప్పుడే విడుదల కావొచ్చని వ్యాపార వర్గాల అంచనా వేస్తున్నాయి.

విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా పెద్దదే. ‘టక్‌ జగదీష్‌’, ‘లవ్‌స్టోరి’, ‘విరాటపర్వం’ తదితర చిత్రాలు రెండో దశ కరోనా వల్ల విడుదల ముంగిట ఆగిపోవల్సి వచ్చింది. ఆ సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్ల ముందుకు వరుస కట్టనున్నాయి. లాక్‌డౌన్‌ తొలగించిన వెంటనే మా సినిమాని విడుదల చేస్తామని ‘లవ్‌స్టోరి’ నిర్మాతలు చెబుతున్నారు. యాభై శాతం ప్రేక్షకులతో అనుమతులు లభించినా తమ సినిమాల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలు చాలామందే ఉన్నారు. విడుదల కావల్సిన సినిమాల జాబితా ఎక్కువగా ఉండటం...ఆలస్యం చేస్తే పోటీ ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో నిర్మాతలు తమ చిత్రాల్ని వీలైనంత త్వరగా విడుదల చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం2’, ‘నారప్ప’ సినిమాలు ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరో వారం రోజుల్లో ‘నారప్ప’ తొలి కాపీ సిద్ధం కానుందని ఆ సినిమా వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. పరిస్థితులు చూస్తుంటే ఈసారి మామా అల్లుళ్లు వెంకటేష్‌, నాగచైతన్య కథా నాయకులుగా నటించిన ‘నారప్ప’, ‘లవ్‌స్టోరి’ సినిమాలతోనే బాక్సాఫీసు దగ్గర సందడి షురూ కావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జులై ఆఖరు, ఆగస్టు ఆరంభంలో ఆ సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. గతేడాది ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాతో థియేటర్ల దగ్గర సందడి మొదలైంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలతో సినీ వ్యాపారం గాడిన పడింది. ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’, ‘వకీల్‌సాబ్‌’లు ఓవర్సీస్‌లోనూ తెలుగు సినిమా పుంజుకున్న వైనం గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈసారి మరింత వేగంగా సినీ పరిశ్రమ గాడిన పడొచ్చనే ఆశాభావం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు