సీఎం జగన్‌ను కలిసి సినీ ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మంగళవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి

Updated : 12 Sep 2023 17:15 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మంగళవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు జగన్‌తో భేటీ అయ్యారు. అగ్ర నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌, దిల్‌రాజు తదిరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎంతో వారు చర్చించారు. రాష్ట్రంలో ఉచితంగా సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ల్యాబ్‌ ఏర్పాటుపై అనుమతి ఇవ్వాలని ఇప్పటికే లేఖ రాయగా, ఈ అంశంపైనా చర్చించినట్లు సమాచారం. 

మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన సినీ ప్రముఖులు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భాజపా నేత గోకరాజు గంగరాజు అతిథి గృహానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు బస చేసిన తర్వాత సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి నేతృత్వంలో 25మంది సినీ ప్రముఖుల బృందం సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏడుగురికి మాత్రమే కలిసే అవకాశం ఉంటుందని చెప్పడంతో కొద్ది మందికి మాత్రమే అవకాశం లభించింది. 

ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి జగన్‌ సాదరస్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశం అయ్యారు. సినీ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు, రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. సినిమా రంగం పూర్వ వైభవం సాధించాలంటే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వినోద రంగంపై విధించే పన్నుకు మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.  విశాఖలో స్టూడియోలు, ల్యాబ్‌లు నిర్మాణానికి అనుకూల ప్రదేశం కావడంతో తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని