సంక్షిప్త వార్తలు (5)

సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 07 Oct 2022 07:21 IST

ఆ రోజు లైక్‌ చేయండి

సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share And Subscribe). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఈ సినిమాని నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించాయి చిత్రవర్గాలు. ‘‘హాస్యం, ఉత్కంఠ మేళవించిన నేర నేపథ్య కథ ఇది. సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జోడీతోపాటు నెల్లూరు సుదర్శన్‌ కలిసి చేసే సందడి అందరికీ వినోదాన్ని పంచుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వసంత్‌, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా.


ప్రేమబంధం

చైతన్య పసుపులేటి (Chaitanya), రితిక చక్రవర్తి జంటగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. చిన్న వెంకటేశ్‌ దర్శకుడు. వి.శ్రీనివాస్‌రావు నిర్మాత. హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు ఆకాష్‌ పూరి క్లాప్‌నిచ్చారు. నిర్మాత రావ్‌ బోయపాటి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపుతో కూడిన  సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ నెల 17 నుంచి చీరాలలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో సుధాకర్‌, స్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు.


ఒక్క రోజులో ప్రేమ

ట్రాఫిక్‌లో బండి నడపడమే కష్టం. కానీ ఆ కుర్రాడు ఏకంగా ఓ అమ్మాయిని ప్రేమించేశాడు. ఒక్క రోజులోనే ఓ అమ్మాయిని ప్రేమలో పడేసిన ఆ కుర్రాడిని కొన్ని ప్రమాదాలు కూడా వెంటాడాయి. అవి ఎలాంటివో తెలియాలంటే ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ...’ (Nachindi Girlfriendu) చూడాల్సిందే. ఉదయ్‌శంకర్‌ (Uday Shankar) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. జెన్నీ కథానాయిక. మధునందన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. గురుపవన్‌ దర్శకుడు. శ్రీరామ్‌ ఆర్ట్స్‌ పతాకంపై అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. అట్లూరి ఆర్‌.సౌజన్య సమర్పకులు. ఈ సినిమా టీజర్‌ని ఇటీవలే విడుదల చేశారు. ‘మీ అమ్మాయిలు ఆలోచించినంతగా మేం చేయం. చూశామా, నచ్చిందా, చెప్పామా, అంతే..’ అంటూ ప్రేమికుడిగా సందడి చేశాడు కథానాయకుడు ఉదయ్‌శంకర్‌. టీజర్‌లో చూపించిన యాక్షన్‌ ఘట్టాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సుమన్‌, పృథ్వీరాజ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గాయత్రి భార్గవి, కల్యాణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రం నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


సుమన్‌.. ‘మహరాజు’

సీనియర్‌ నటుడు సుమన్‌ (Suman) కథానాయకుడిగా ‘మహరాజు’ (Maharaju) చిత్రం మొదలైంది. దర్శకనిర్మాత వెంకట నరసింహరాజ్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల్ని  నిర్వహించారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘మా సంస్థలో ‘అల్లుడు బంగారం’, ‘అంతేనా... ఇంకేం కావాలి’ తర్వాత రూపొందుతున్న చిత్రమిది. వైవిధ్యమైన కథతో తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెలలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ మొదలవుతుంది. సుమన్‌, ఇతర సీనియర్‌  నటులతోపాటు, కొత్తతరం కూడా నటిస్తార’’న్నారు. సంగీతం: శ్రీవెంకట్‌.


‘అహింస’ మార్గాన...

బుద్ధుడి బోధనల్ని నమ్మిన యువకుడు అతడు. అహింసా (Ahimsa) మార్గాన్ని అనుసరిస్తున్న అతని జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. హింసాత్మక పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమని ఎలా నిలబెట్టుకున్నాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు తేజ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అహింస’. అభిరామ్‌ (Abhiram) హీరోగా పరిచయం అవుతున్నాడు. గీతిక తివారీ నాయిక. పి.కిరణ్‌ నిర్మాత. ఇటీవల ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘‘మరో అందమైన ప్రేమకథ ఇద’’ని సినీ వర్గాలు తెలిపాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని